జస్ట్ డెలీవరీకి ముందు ఈ డాక్టర్ ఏం చేశారో తెలుసా..
కెంటకీ: వైద్యులంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేవారని ప్రతీతి. అందుకే దాదాపు రోగులందరూ డాక్టర్లను దేవుడితో సమానంగా చూస్తారు. దీనికి అనుగుణంగానే ఓ మహిళా డాక్టర్ డ్యూటీలో లేకపోయినా..పెద్దమనసుతో వ్యవహరించి శబాష్ అనిపించుకుంది. ప్రసవ వేదనను అనుభవిస్తూ..తోటి మహిళ కష్టాన్ని, వేదను అర్థం చేసుకుని కార్యరంగంలోకి దూకింది. మరి కొద్దిక్షణాల్లో తాను బిడ్డకు జన్మ నివ్వబోతూ కూడా వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్న వైనం పలువురి ప్రశంసలందుకుంటోంది. డా. హాలా సాబ్రీ ఈ ఉదంతాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. డాక్టర్ అమండా హెస్ డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరారు. పేషెంట్ గౌన్ వేసుకుని లేబర్ రూంలో వెళుతున్నారు. ఇంతలో మరో మహిళ ప్రసవ వేదన ఆమె చెవిన పడింది. ఆమె గర్భంలో బిడ్డ పేగు మెడకు వేసుకుని ప్రమాదంలో పడ్డాడు. దీంతో ప్రసవం కష్టంగా మారింది. మరోవైపు డ్యూటీ డాక్టర్ రావడానికి ఇంకా సమయం ఉంది. దీంతో సమయ స్పూర్తిగా వ్యవహరించిన డా. అమండా క్షణం ఆలస్యం చేయకుండారంగంలోకి.. తల్లీ బిడ్డలను కాపాడారు. ఆ తరువాత పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
తాను తన వృత్తిని ప్రేమిస్తానని, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడం తనకు సంతోషాన్నిస్తుందని డా. అమండా తెలిపారు. అంతేకాదు అనారోగ్యానికి గురైనా తమ రోగుల సంరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించే డాక్టర్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు.