పెన్సుల్వేనియా : కరోనా మహమ్మారి వ్యాధిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు, మెడిసిన్ల కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వైరస్ బారిన పడిన వారిని క్వారంటైన్‌లో ఉంచడమే ఇప్పటికిప్పుడు అందరి ముందున్న ఒకే ఒక మార్గం. అయితే కరోనా బారిన పడిన వారిని గుర్తించడం ఇప్పుడు అందరి ముందున్న అతిపెద్ద సవాలు. ముఖ్యంగా చాలా మందిలో కరోనా వైరస్ సోకినా 14 రోజుల వరకు ఎలాంటి లక్షణాలు బయటపడటం లేదు. వీరి ద్వారా మరింత మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వీటికి తోడూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో కొత్త పద్దతుల్లో కరోనా వ్యాధి సోకిన వారిని గుర్తించడానికి చేస్తున్న పరిశోధనల్లో భాగంగా బ్రిటన్, అమెరికాలు శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి.
పెన్సిల్వేనియా యూనివర్శిటీలో లాబ్రెడార్ రిట్రీవరస్ జాతికి చెందిన 8 కుక్కులకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ రోగుల నుంచి వచ్చే వైరస్ వాసనను అవి పసిగట్టలవా? లేదా? వాటికి అలాంటి సామర్థ్యం ఉందా? అనే దానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే లండన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కూడా గతంలో ఇలాంటి పరీక్షలు నిర్వహించింది. మనుషుల్లో మలేరియా లక్షణాలు ఉన్న రోగులను కుక్కలు పసిగట్టగలవని గుర్తించింది. ఒకవేళ కుక్కలు కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించగలిగితే.. విమానాశ్రయాలు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రుల్లో కుక్కలు కూడా సేవలు అందించే అవకాశం ఉంటుంది.
కరోనా వైరస్‌ను వాసన ద్వారా కుక్కలు పసిగట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. గతంలో సార్స్‌తోపాటు డ్రగ్స్, మారణాయుధాలు, మలేరియా ఇన్ఫెక్షన్లు, కేన్సర్లను గతంలో కుక్కలు వాసన ద్వారా గుర్తించి సేవలందిస్తున్నాయని తెలిపారు. వైరస్‌లకు ప్రత్యేకమైన వాసన ఉంటుందని పెన్సిల్వేనియాలో స్కూల్ ఆఫ్ వెటర్నిటీ మెడిసిన్‌లో వర్కింగ్ డాగ్ సెంటర్‌లో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సింథియా ఎమ్ ఓట్టో తెలిపారు. ఒకవేళ కుక్కలు వాసనతో కరోనా వైరస్ పాజిటివ్ రోగులను పసిగట్టగలిగితే ఒక కుక్క గంటకు 250 మంది వరకు పరీక్షించగలదని శిక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ రోగుల నుంచి సేకరించిన మూత్రం, లాలాజలం ద్వారా కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత కరోనా వ్యాధి గ్రస్తుల నుంచి వచ్చే వాసన ద్వారా కుక్కలు వారిని గుర్తించేలా శిక్షణ ఇస్తామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment