ఢాకా : రోహింగ్యా శరణార్థులకు మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఇవ్వరాదని టెలికామ్ సంస్థలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అంతర్గత భద్రత, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ఆస్కారముండడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు మొత్తం 4 లక్షల 30 వేల మంది రోహింగ్యాలు శరణార్థులుగా వచ్చారు. వీరెవరికీ మొబైల్ సదుపాయాలు కల్పించరాదనే కఠిన నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. దీనిపై టెలికామ్ మంత్రి ఇనాయత్ హుస్సేన్ మాట్లాడుతూ.. దేశంలోని నాలుగు టెలికామ్ సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రోహింగ్యాల వద్ద మొబైల్స్ ఉన్నాయని.. స్థానికత లేని వారికి సిమ్‌కార్డులు ఇవ‍్వడం అనేది దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశముందని చెప్పారు.
ఇప్పటికే బంగ్లా పౌరసత్వ అధికార ధృవీకరణ పత్రం లేకుండా సిమ్ కార్డులు జారీ చేయడాన్ని నిషేధించినట్లు ఆయన తెలిపారు. మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలను కేవలం మానవతా దృక్ఫథంతోనే బంగ్లాదేశ్ ఆశ్రమం కల్పించిందని.. అదే సమయంలో మా దేశ అంతర్గత భద్రత మాకు ముఖ్యమని మరో మంత్రి తరానా హాలీమ్ చెప్పారు. శరణార్థి రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్న కాక్స్ బజార్‌ను డేగకన్నుతో పరిశీలిస్తున‍్నట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని స్పష్టంగా వివరణ చేయకున్నా.. పూర్తి స్థాయిలో రక్షణ, భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు హాలీమ్ చెప్పారు.