ప్రతీకాత్మక చిత్రం
రియాద్ (సౌదీఅరేబియా): మద్యం మత్తులో వాహనం నడిపి ఆరుగురి మరణానికి కారణమైన వ్యక్తిని సౌదీ పోలీసులు బహిరంగంగా శిరచ్ఛేదం చేశారు. నాలుగేళ్ల కిందట రియాద్లోని అల్-యాస్మీన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. వివరాలు.. అబ్దుల్ మాలిక్ అల్-దిహైమ్ బ్రిటన్‌లో చదువుకునేవాడు. తీర్థయాత్ర కోసం 2013 అక్టోబర్ లో తన స్వదేశమైన సౌదీకి వచ్చాడు. తీర్థయాత్ర ముగించుకున్న తర్వాత తన ఆడి కారులో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన మరో వాహనం, వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆడి కారులో ప్రయాణిస్తున్న అబ్దుల్ మాలిక్ అల్-దిహైమ్, అయన చెల్లెళ్లు హిస్సా అల్-దిహైమ్, నడా అల్-దిహైమ్, నూహా అల్-దిహైమ్, అబీర్ అల్-దిహైమ్, మేనకోడలు నోరా అల్-దిహైమ్లు మృతిచెందారు. అయితే ఆ సమయంలో మరో వాహనం నడిపిన మహ్మద్ అల్-ఖతాని మద్యం సేవించడమే కాకుండా, గంటకు 180-200 కి.మీ వేగంతో వాహనాన్ని నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆరుగురి చావుకు కారణమైన మహ్మద్ అల్-ఖతానికి కోర్టు బహిరంగ మరణశిక్ష అమలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని చంపేసి ఆ కుటుంబానికి మహ్మద్ అల్-ఖతాని తీరని అన్యాయం చేశాడని కోర్టు పేర్కొంది. మహ్మద్ అల్-ఖతానిలాంటి వ్యక్తులకు భూమ్మీద బతికే అర్హత లేదని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ప్రజలందరూ చూస్తుండగానే సౌదీ పోలీసులు మంగళవారం బహిరంగంగా మహ్మద్ అల్-ఖతానికి శిరచ్ఛేదనం చేశారు.
తాగుడుకు బానిసను చేసిన ఎయిడ్స్
ప్రమాదానికి కారణమైన మహ్మద్ అల్-ఖతానికి 26 ఏళ్ల వయస్సులోనే ఎయిడ్స్ వ్యాధి సోకింది. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు అతన్ని దూరం పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికిలోనై తాగుడుకు బానిసగా మారాడు. తర్వాత ఎయిడ్స్ బాధితులకు సహాయం చేయడానికి పలు ఎయిడ్స్ ఆర్గనైజేషన్స్లలో వాలంటీర్గా పని చేశాడు. తన వ్యాధి కొద్దిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఉద్యోగంలో కూడా చేరాడు. మరో ఎయిడ్స్ బాధితురాలిని వివాహం కూడా చేసుకోవాలనుకున్నాడు. సరిగ్గా రోడ్డు ప్రమాదం జరిగిన రోజే ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అంతలోనే ఘోర ప్రమాదం జరగడంతో ఆరుగురు మృతిచెందారు. ఆ ప్రమాదానికి తాను చేసిన పొరపాటే కారణం అని తెలుసుకుని తీవ్ర పశ్చాత్తాపపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత మూడు రోజులపాటూ ఆహారం కానీ, మెడిసిన్స్ కానీ తీసుకోలేదు. కష్టాల్లో నుంచి తేరుకొని మంచి జీవితం కోసం నేను చేసిన కృషి మొత్తం చిన్న తప్పిదంతో నాశనమైపోయిందని శిక్ష అమలుకు ముందు మహ్మద్ అల్-ఖతాని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment