
వాషింగ్టన్: ఆకుకూరలు ఎక్కువగా తింటే ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసిందే. అయితే ఆ కూరలు ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచడమేకాదు.. మన వయసును తగ్గిస్తాయట. అదెట్లా? అని ఆశ్చర్యపోవద్దు.. ఎందుకంటే ఆకు కూరలు మెదడు వయసును తగ్గిస్తాయట. అంటే... మన శరీరం వయసు పెరిగినా దాని ప్రభావం మెదడుపై పడకుండా చేస్తాయట. దీనివల్ల ఆకుకూరలు తినేవారు మరింత చురుగ్గా కనిపిస్తారట.
రోజూ ఆకుకూరలను తమ ఆహారంలోభాగం చేసుకున్నవారు మిగతావారితో పోలిస్తే 11 సంవత్సరాలు వయసు తక్కువగా కనిపిస్తారని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమెరికాలోని రష్ యూనివర్సిటీ తన జర్నల్‌లో ప్రచురించింది. పరిశోధనలోభాగంగా ప్రతిరోజూ ఆకుకూరలు తినేవారికి, అప్పుడప్పుడు మాత్రమే తినేవారికి కొన్ని పరీక్షలు పెట్టారు. వీరిలో ప్రతిరోజూ ఆకుకూరలు తినేవారు ఏదైనా ఆలోచించేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదట. మిగతావారు మాత్రం చిన్నపాటి విషయాలకు కూడా గంటల తరబడి ఆలోచించడాన్ని గమనించారట. దీనికి కారణం వారి శరీర వయసుకంటే మెదడు వయసు ఎక్కువగా ఉండడమేనని గుర్తించారు.