గుడ్డుతిన్నా గుండె పదిలమే!
లండన్: కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న గుడ్డును తరచుగా తింటే గుండెజబ్బులు వస్తాయని భయపడుతున్నారా? అలాంటి భయాలేవీ అక్కరలేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తలు. రోజుకో గుడ్డు తిన్నా గుండె పదిలంగానే ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తం సరఫరాకు ఇబ్బంది కలుగుతుంది. ఫలితంగా హృదయ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.
అయితే గుడ్డులో ఉండే కొవ్వు పదార్థాల కారణంగానే రక్తనాళాల మందం పెరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. పైగా రక్తంలో కొవ్వుశాతం పెరగడానికి కూడా గుడ్డు ఏమాత్రం కారణం కాదని రుజువైంది. ఎటువంటి గుండె జబ్బులు లేని 1,032 మందిపై దాదాపు 21 ఏళ్లపాటు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. ఈ వివరాలు అమెరికన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.