శాన్‌ఫ్రాన్సిస్కో: స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మానవాళికి భారీ ముప్పు ఏర్పడనుందంటూ ట్వీట్ చేశారు. అతి త్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే దాన్ని ఎదుర్కొనేంత సాంకేతికత, శక్తిసామర్థ్యాలు మనకు లేవని పేర్కొన్నారు. త్వరలో భూమిని ఓ భారీ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒకరు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఎలన్ మస్క్ ఈ అంచనాకు వచ్చారు.
అపోఫిస్ అనే పేరుగల ఈ ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 13, 2029న భూమిని ఢీకొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇటీవల సైంటిస్టులు వెల్లడించారు. దీనికి ‘గాడ్ ఆఫ్ చావోస్’ అనే ఈజిప్టు దేవుని పేరు పెట్టారు. 1100 అడుగుల పొడవు గల ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొడితే 15,000 వేల అణుబాంబుల శక్తి ఉత్పన్నమవుతుంది. భూమిపై పెనుమార్పులు సంభవిస్తాయి. అయితే దీనిపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆస్ట్రాయిడ్‌తో భూమికి వచ్చే పెద్ద ప్రమాదమేమీలేదని కొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది భూమికి కేవలం 23,363 మైళ్ల దూరంలో మాత్రమే వెళ్లనుంది. అయితే దీని గమనాన్ని ఖచ్చితంగా చెప్పలేమన్నారు.
2029లో ఇది అత్యంత ప్రకాశవంతంగా.. కంటికి కనిపించేంత దగ్గరగా భూమి వాతావరణం మీదుగా ప్రయాణిస్తుంది. ఓ ఖగోళ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘నిజంగా ఇది అద్భుత అవకాశం. ఈ ఆస్ట్రాయిడ్‌ను అందుకుంటే సైన్సు అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. దీనితో పాటు 5 నుంచి పది మీటర్ల పొడవుగల ఆస్ట్రాయిడ్‌లు కూడా ప్రయాణిస్తాయి’ అని తెలిపారు. ‘ప్రస్తుతానికి ఇది భూమిని ఢీకొట్టే అవకాశం స్వల్పమే. కానీ భవిష్యత్‌లో మనం ఊహించనంత వేగంగా భూమి మీదకు దూసుకు రావోచ్చు’అని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment