
శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్నప్పుడు మీరెప్పుడైనా ఓ విషయాన్ని గమనించారా. ఫేస్‌బుక్‌లో వచ్చే ప్రకటనలు చూసి.. ఇది ఇప్పుడే ఎక్కడో చూశానే అని మీకెప్పుడూ డౌట్ రాలేదా?.. ఈ యాడ్‌లో వచ్చిన కంటెంట్‌ను ఎక్కడో బ్రౌజ్ చేశానే అని అనిపించలేదా.. కచ్చితంగా చాలామందికి అనిపించే ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌లో మనం ఉపయోగించిన ఇతర యాప్‌లు, బ్రౌజర్లు, వెబ్‌సైట్లు, ఇతర డేటా ప్రకారమే ఫేస్‌బుక్‌లో మనకు ప్రకటనలు వస్తుంటాయి. దీనికి కారణం ఫేస్‌బుక్ మనం చేసే ప్రతీ కార్యకలాపం పైనా ఓ కన్నేసి ఉంచుతుంది. అయితే తాజాగా దీనిపై ఫేస్‌బుక్ స్వీయ నియంత్రణ విధించుకోనుంది.
ఇకపై మనం చూసిన వెబ్‌సైట్లు, బ్రౌజర్లలో యూజర్ కార్యకలాపాల ప్రకారం ఫేస్‌బుక్‌లో ఇచ్చే ప్రకటనలను తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. దీనికోసం ఫేస్‌బుక్ యాప్‌లో ఓ ఆప్షన్‌ను తీసుకురానుంది. యూజర్లు సంబంధిత సెక్షన్‌లోకి వెళ్లి ‘ఆఫ్–ఫేస్‌బుక్ యాక్టివిటీ’అనే ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవాలి. అయితే దీంట్లో ఓ మెలిక ఉంది. ఆఫ్ చేసినప్పటికీ ఫేస్‌బుక్ మీ డేటాను ట్రాక్ చేయడం ఆపదు. కేవలం దానికి సంబంధించిన ప్రకటనలు మాత్రమే తక్కువ సంఖ్యలో వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను సౌత్ కొరియా, ఐర్లాండ్, స్పెయిన్‌ల్లో మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఆప్షన్‌ను ఇతర మార్కెట్లలోకి ఎప్పుడు ప్రవేశపెట్టేది స్పష్టతివ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment