
సాక్షి,న్యూఢిల్లీ: భారత కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పేందుకు గోల్డ్ స్మగర్లు రూటు మార్చారు. గల్ఫ్ దేశాల నుంచి గోల్డ్ స్మగర్ల స్వర్గధామంగా ఇప్పుడు యూరప్ దేశాలు మారాయి. గోల్డ్ స్మగ్లింగ్‌కు చెక్ పెట్టేందుకు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా తీవ్రతరం చేయడంతో అక్రమార్కులకు యూరప్ దేశాలను టార్గెట్ చేశారు.యూరప్ దేశాల నుంచి అక్రమ బంగారాన్ని తెచ్చే కేసులు ఇటీవల పెరిగిపోతుండటంతో స్మగ్లర్లు గల్ఫ్ నుంచి యూరప్‌కు మళ్లినట్టుగా తేలుతున్నదని సీనియర్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వచ్చిన ఇద్దరు వృద్ధ దంపతులు ఇటీవల రూ 25 లక్షల విలువైన 995 గ్రాముల బంగారాన్ని దేశంలోకి అక్రమంగా తరలిస్తూ ఇటీవల పట్టుబడ్డారు. ఇక నవంబర్ 2న లండన్ నుంచి వస్తున్న ఓ ప్రయాణీకుడు ఒక కిలో బంగారం అక్రమంగా తీసుకువస్తూ పట్టుబడ్డాడు.రూ 30 లక్షల విలువైన బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. గత నెలలో రూ 66 లక్షల విలువైన రెండు కిలోల అక్రమ బంగారం ప్యారిస్ నుంచి తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
అదే నెలలో ఇటలీ నుంచి మరో ప్రయాణీకుడు కేజీన్నర బంగారాన్ని దేశంలోకి తెస్తూ పట్టుబడ్డాడు. ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ యూరప్ దేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. భారత్‌లోకి అక్రమ బంగారం తరలించేందుకు అడ్డాగా మారిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో నిఘాను కట్టుదిట్టం చేశామని కస్టమ్స్ అధికారులు చెప్పారు.