
పొద్దుతిరుగుడు విద్యుత్తు
ఎందరు అవునన్నా... ఇంకెందరు కాదన్నా.. భూమికి ముప్పు ముంచుకొస్తోందన్నది మాత్రం వాస్తవం. పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వాడకం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా వాతావరణ మార్పులు ఎక్కువైపోయి 2100 నాటికి భూమిపై మనిషి బతికే పరిస్థితులు ఉండవని శాస్త్రవేత్తలందరూ చెబుతున్నారు. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే సౌరశక్తి మొదలుకొని అనేక సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలన్న విషయంలోనూ ఏకాభిప్రాయం ఉంది. అందుకే ఇప్పటివరకూ ఇంటిపైకప్పులకే పరిమితమైన సోలార్ ప్యానెళ్లు ఇప్పుడు రోడ్లపై, కిటికీల్లోనూ వచ్చేస్తున్నాయి.
సియోల్‌లోని ఓ ఆర్కిటెక్చర్ సంస్థ ఇంకో అడుగు ముందుకేసి... ఈ ఫొటోల్లో కనిపిస్తున్న తీరులో సోలార్‌పైన్స్‌ను డిజైన్ చేసింది. ఈ నిర్మాణం పైభాగంలో కొంత ఎడంగా... అందమైన డిజైన్ రూపంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఇవి ఒకవైపు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే ఇంకోవైపు మంచి ఎండలోనూ చల్లటి నీడనిస్తాయి. అంతేకాకుండా... ఈ నిర్మాణం మొత్తం సూర్యుడి కదలికలకు అనుగుణంగా కదిలే ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రతిరోజు ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ ఒక్క నిర్మాణం ద్వారా గంటకు 1.2 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ఇంకోలా చెప్పాలంటే ఒక ఇంటికి అవసరమైన విద్యుత్తు మొత్తం తయారవుతుందన్నమాట. పార్కుల్లో భారీ భవంతుల మధ్య ఉండే ఖాళీ స్థలాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తే ప్రజలు, ఉద్యోగులు సేదదీరేందుకూ ఉపయోగించుకోవచ్చునని, పార్కింగ్ ప్లేస్‌లుగానూ వాడుకోవచ్చునని వీటిని డిజైన్ చేసిన హెచ్‌జీ ఆర్కిటెక్ట్స్ అంటోంది. ప్రస్తుతానికి ఇవి నమూనాలు మాత్రమే. డిమాండ్ పెరిగే కొద్దీ తాము మరింత సమర్థమైన, సరికొత్త డిజైన్లతో ఈ సోలార్ పైన్లను తయారు చేస్తామని అంటోంది ఈ కంపెనీ!