
అధ్యక్ష పదవి రేసులో హిల్లరీ
- ట్వీటర్‌లో స్వయంగా వెల్లడి
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష పదవికి తాను మరోసారి పోటీపడబోతున్నానని అమెరికా మాజీ మంత్రి, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె ట్వీటర్లో పేర్కొనడంతో పాటు తన మద్దతుదారులకు ఈ మెయిల్ సందేశమిచ్చారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు. ‘అధ్యక్ష పదవికి పోటీపడబోతున్నాను.
ఒక చాంపియన్ కావాలని ప్రతిరోజూ అమెరికన్లు కోరుకుంటున్నారు. నేను ఆ చాంపియన్‌గా ఉండాలనుకుంటున్నాను’ అని ట్వీటర్‌లో తెలిపారు. 2008లో డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి బరాక్ ఒబామాతో పోటీ పడి నెగ్గలేకపోయిన ఆమె రంగంలోకి దూకడం ఇది రెండోసారి. 2001-2009 వరకు ఆమె సెనేట్‌కు న్యూయార్క్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
కాగా, హిల్లరీ శక్తిమంతమైన ప్రెసిడెంట్ కాగలరని రెండు రోజుల క్రితం అధ్యక్షుడు ఒబామా కూడా ప్రశంసించారు. మంత్రిగా ఆమె ఆద్భుతమైన సేవలందించారని కితాబిచ్చారు. 2009-13 మధ్య మంత్రిగా పనిచేసిన ఆమె.. పలు సందర్భాల్లో భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారు.