23 ఏళ్ల క్రితం చనిపోయి ఇప్పుడు బతికొస్తే.....
న్యూయార్క్: భర్త చనిపోయాడనుకొని ఇద్దరు పిల్లలను పోషిస్తూ బతుకుతున్న ఓ భార్యకు 23 ఏళ్ల అనంతరం తన భర్త బతికే ఉన్నాడని తెలిస్తే ఎలా ఉంటుంది? ఆరు, తొమ్మిదేళ్ల వయస్సులో తమను విడిచి వెళ్లిపోయిన తండ్రి బతికి ఉన్నాడని తెలుస్తే ఇద్దరు పిల్లలకు ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకొన్న 20 ఏళ్ల తర్వాత తన భర్తకు అంతకుముందే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలకూడా ఉన్నారని తెలిస్తే మరో భార్యకు ఎలా ఉంటుంది? తన తండ్రి పేరు ఇంతకాలం భావిస్తున్నట్టుగా టెర్రీ జూడ్ సిమాన్స్కీ కాదని, రిచర్డ్ హోగ్‌లాండ్ అనే మోసగాడని తెలిస్తే ఓ టీనేజ్ అబ్బాయికి ఎలా ఉంటుంది? రెండు కుటుంబాల్లో ఇలాంటి విచిత్ర పరిస్థితిని కల్పించిన రిచర్డ్ హోగ్‌లాండ్ అనే 63 ఏళ్ల వృద్ధుడిని అమెరికాలోని ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇండియానా రాష్ట్రానికి చెందిన రిచర్డ్ హోగ్‌లాండ్ 1980వ దశకంలో లిండా ఐస్లర్ అనే యువతిని వివాహం చేసుకొన్నారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. ఉన్నంతలో హాయిగానే జీవిస్తున్నారు. 1993లో ఒకరోజు భార్యా భర్తలు ఇద్దరు ఒకేచోట పొలం పనులు చేసుకుంటున్నారు. హఠాత్తుగా తనకు వంట్లో బాగా లేదని, ఆస్పత్రికి వెళ్లి చూపించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటానని రిచర్డ్ భార్యతో చెప్పారు. కాసేపు ఆగితే తానూ పని ముగించుకొని వస్తానని లిండా చెబుతున్నప్పటికీ తన పరిస్థితికి అంత సమయం లేదంటూ రిచర్డ్ వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికెళ్లాక చూస్తే భర్త జాడ కనిపించలేదు. ప్రతి ఆస్పత్రికి లిండా ఫోన్ చేసి వాకబు చేశారు. ఎక్కడా భర్త ఆచూకి దొరకలేదు.
భర్త వస్తాడని రెండు, మూడు రోజులు నిరీక్షించిన లిండా చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు అదృశ్యం కేసు కింద నమోదు చేసి దర్యాప్తు జరిపినా రిచర్డ్ ఆచూకీ దొరకలేదు. భర్తను లిండానే చంపి ఉంటారనే అనుమానంతో పోలీసులు ఆమెను కూడా వేధించారు. చివరకు ఎలాంటి సాక్ష్యాధారాలు దొరక్కపోవడంతో పోలీసులు వదిలేశారు. భర్త చనిపోయి ఉంటాడని భావించిన లిండా, అప్పటికే ఆరు, తొమ్మిదేళ్లున్న ఇద్దరు పిల్లల పోషణే ప్రధాన బాధ్యతగా జీవితం గడుపుతూ వచ్చారు. అవసరార్థం ఉన్న ఓ కారు, చిన్న ఇల్లును కూడా అమ్మేశారు. ఈ లోగా 23 ఏళ్లు గడిచిపోయాయి.
ఇటీవల లిండాకు ఫ్లోరిడాలోని పోస్కో కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డిటెక్టివ్ ఆంథోని కార్డిల్లో నుంచి ఫోన్ వచ్చింది. రిచర్డ్ హోగ్‌లాండ్ ఏమవుతారని ఆయన లిండాను ప్రశ్నించారు. తన మాజీ భర్తని, ఎప్పుడో చనిపోయారని లిండా తెలిపారు. అదంతా అబద్ధమని, తాము అరెస్ట్ చేసిన ఓ మోసగాడి అసలు పేరు రిచర్డ్ అని తేలిందని ఆంథోని పూసగుచ్చినట్లు కేసు వివరాలను లిండాకు పూర్తిగా వివరించారు.
భార్యా పిల్లలను వదిలేసిన రిచర్డ్ 1993లో ఇండియానా నుంచి ఫ్లోరిడాకు మకాం మార్చేశాడు. 1991లో సముద్రంలో మునిగి చనిపోయిన ఓ మత్సకారుడి డెత్ సర్టిపికెట్‌ను టెర్రీ జూడ్ సిమాన్స్కీ ఎలాగో సంపాదించాడు. దాని ఆధారంగా బర్త్ సర్టిఫికెట్, దాంతో ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాడు. డ్రెవర్‌గా సెటిలై మేరి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. శాశ్వతంగా టెర్రీ జూడ్ సిమాన్స్కీగా మారిపోయాడు. టెర్రీ చనిపోయే నాటికి పిల్లలే కాదు, పెళ్లికూడా కాకపోవడం రిచర్డ్‌కు కలిసివచ్చింది. తన రెండో జీవితాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
మూడేళ్ల క్రితం టెర్రీ మేనల్లుడు ఓ రోజు నెట్‌లో ఏదో సర్చ్ చేస్తుండగా హఠాత్తుగా ఎప్పుడో మరణించిన టెర్రీ బతికున్నట్లు తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయాన్ని సమీప బంధువులకు తెలిపాడు. చనిపోయిన టెర్రీ పేరిట ఆస్తిపాస్తులు ఏమీ లేనందున మోసగాడిపై ఫిర్యాదు చేయడం ఎందుకు, అనవసరంగా లేనిపోని చిక్కులు తెచ్చుకుంటామంటూ వారు మౌనం వహించారు. అయితే చివరికి గత జూన్ నెలలో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై నెలలో పోలీసులు రిచర్డ్‌ను అరెస్ట్ చేశారు.
ముందుగా నేరాన్ని అంగీకరించని రిచర్డ్ చివరకు ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు రెండు కుటుంబాలకు రిచర్డ్ అరెస్ట్ సమాచారం అందించారు. ఎవరైనా నేరం చేయడానికి ఫేక్ ఐడెంటినీ సంపాదిస్తారని, రెండో పెళ్లి చేసుకోవడానికి రిచర్డ్ ఆ ఐడెంటినీ ఉపయోగించడం ఆశ్చర్యంగా ఉందని, తమ దేశంలో ఇలాంటి కేసు ఇదే మొదటిదేమోనని డిటెక్టివ్ ఆంథోని వ్యాఖ్యానించారు. మొదటి భార్యతో 11 ఏళ్లు, రెండో భార్యతో 20 ఏళ్లు కాపురం చేసిన రిచర్డ్ శేష జీవితాన్ని ఎవరితో గడుపుతారో విడుదలయితేగానీ తెలియదు.