
సాక్షి, న్యూఢిల్లీ : ఇక నుంచి తాము చెప్పిన మాట వినకుండా అతి చేస్తే పాకిస్ధాన్‌కు గట్టి సమాధానం చెప్పి తీరుతామని భారత ఆర్మీ హెచ్చరించింది. అది ఎంత చేస్తే అంతకు రెట్టింపు నష్టాన్ని పాక్ చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. నలుగురు భారత సైనికులపై పాక్ సైనికులు కాల్పులు జరపడంతో వారు చనిపోయిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిగా భారత్ సేనలు సోమవారం ఉదయం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి దూసుకెళ్లి ఆరుగురు పాక్ ఆర్మీ జవాన్లు కాల్చిపడేసింది. ఈ సందర్భంగా భారత ఆర్మీలోని నిపుణులు ముఖ్యంగా మేజర్ జనరల్ (మాజీ) నరేశ్ బదానీ ఈ దాడిపై మాట్లాడుతూ భారత సైనికులు తాజాగా చేసిన చర్య కూడా మరో సర్జికల్ స్ట్రైక్ లాంటిదేనని అన్నారు.
గతంలో అయితే, పూర్తిస్థాయి సర్జికల్ దాడికి తాజాగా జరిగిన దాడికి కొంత వ్యత్యాసం ఉందన్నారు. అయితే, దీనిని పూర్తి స్థాయిలో దెబ్బకు దెబ్బ, ప్రతీకార దాడి అని చెప్పారు. తొలుత పాక్ వాళ్లే భారత సైనికులను కాల్చి చంపారని అందుకు ప్రతీకారంగానే భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లి ప్రతీకారం తీర్చుకుందని చెప్పారు. ఇక నుంచి పాక్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిదని అన్నారు. లేకుంటే పాక్ ఆలోచించేలోపే భారత్ దెబ్బకొడుతుందని, గట్టి సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. అయితే, శాంతికి తొలి ప్రాధాన్యం భారత్ ఇస్తుందని, అలాగే సమయానికి తగ్గట్టు ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment