►అమెరికా ప్రతినిధుల సభ కమిటీ నివేదిక
► రాజకీయ అవినీతి, చిత్తశుద్ధి లోపం వల్ల మైనారిటీలపై నేరాలు
►బాధితులకు సరైన న్యాయం జరగడం లేదని వెల్లడి
వాషింగ్టన్: లౌకిక దేశంగా, విభిన్న మతాల ప్రజలు ఐక్యంగా ఉండే దేశంగా పేరున్నా... భారతదేశంలో మైనారిటీల రక్షణ, భద్రత కోసం, సరైన న్యాయం కోసం సంఘర్షణ జరుగుతోందని అమెరికా పేర్కొంది. రాజకీయంగా చిత్తశుద్ధి లోపించడం వల్ల.. రాజకీయ అవినీతి వల్ల, ప్రభుత్వ అధికారులే మతపరంగా వివక్ష చూపించడం వల్ల వారిపై నేరాలు జరిగినప్పుడు.. ఏ మాత్రం న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ స్థాయిలో మత స్వేచ్ఛ అంశంపై ఏర్పాటైన అమెరికా ప్రతినిధుల (కాంగ్రెస్) సభా కమిటీ (యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలీజియస్ ఫ్రీడమ్-యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) ఈ మేరకు గురువారం ఒక వార్షిక నివేదికను విడుదల చేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అమెరికా వీసా నిరాకరించడానికి.. ఈ కమిటీయే ప్రధాన కారణం కావడం గమనార్హం.
► మత స్వేచ్ఛకు ప్రత్యక్షంగా, పరోక్షంగా విఘాతం కలిగించిన వ్యక్తులను దేశంలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (ఐఆర్‌ఎఫ్‌ఏ) ఉపయోగపడుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది.
► అయితే దానిని కేవలం ఒకసారి మాత్రమే ప్రయోగించడానికి అవకాశం ఉందని, దీనిని సవరించాలని కమిటీ అమెరికా ప్రభుత్వానికి సూచించింది.
► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మోడీ తరహాలో మత స్వేచ్ఛకు విఘాతం కలిగించిన వారి జాబితాను అమెరికా హోం, విదేశీ మంత్రిత్వ శాఖలకు అందజేశామని.. దీని ఆధారంగా వీసా నిషేధిత వ్యక్తుల జాబితాను పెంచాలని కోరింది.
► భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మత స్వేచ్ఛ అంశంపైనా దృష్టి పెట్టాలని అక్కడి ప్రభుత్వానికి సూచించింది. మత పరమైన హింస, వివక్షపై సమర్థవంతంగా స్పందించేలా, ఉన్నత స్థాయి ప్రమాణాలు నెలకొల్పేలా పోలీసుశాఖను బలోపేతం చేసేలా ప్రోత్సహించాలని పేర్కొంది.
భారత్‌లో మైనారిటీల భద్రతపై సంఘర్షణ
Published Fri, May 2 2014 4:15 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM
Advertisement
Advertisement