ఐక్యరాజ్యసమితి: అణ్వస్త్ర ఉగ్రవాదం సవాళ్లను, ముప్పును ఎదుర్కొనేందుకు అంతర్జాతీయు సహకారం అవసరమని భారత్ స్పష్టంచేసింది. అత్యంత ప్రమాదకరమైన అణ్వస్త్ర సామాగ్రిని ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు సమకూర్చుకోకుండా నివారించేలా అణ్వస్త్ర భద్రతా వ్యవస్థను బలోపేతంచేసేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని భారత్ సూచించింది. అణ్వస్త్ర ఉగ్రవాదం అంతర్జాతీయు సమాజానికి తీవ్రమైన సవాలుగా పరిణమించిన నేపథ్యంలో ఈ చర్యలు అవసరమని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లోని భారత శాశ్వత బృందం ఫస్ట్ సెక్రెటరీ అభిషేక్ చెప్పారు. సోమవారం ఐరాస సర్వప్రతినిధి సభలో అంతర్జాతీయు అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వార్షిక నివేదికపై ప్రకటన సందర్భంగా అభిషేక్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సభ్య దేశాల్లో రాజకీయపరంగా జోక్యం చేసుకునేటప్పుడు ఐక్యరాజ్యసమితి మరింత పారదర్శకంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.
నిర్దేశిత లక్ష్యానికి, వాస్తవానికి చాలా అంతరం ఉంటోందని, దీనిని తగ్గించేందుకు సభ్య దేశాలతో లోతుగా చర్చలు జరపాలని కోరారు. సభ్య దేశాల సహాయ సహకారాలతో సాగించే శాంతి పరిరక్షక దళాలు సహా అన్ని కార్యకలాపాలపై పూర్తి స్థాయి సమాచారం అందజేయాలని సింగ్ పేర్కొన్నారు. మరోవైపు పరివేష్టిత(సముద్ర తీర ప్రాంతం లేని) దేశాల అభివృద్ధికి ప్రత్యేక ఎజెండా అవసరమని భారత్ పేర్కొం ది. పరివేష్టిత దేశాల అభివృద్ధిపై వియన్నాలో ఐక్యరాజ్యసమితి రెండవ సమావేశం జరిగింది.