
జకార్తా: జకార్తాలోని ఇండోనేషియా స్టాక్ ఎక్చ్సేంజ్ భవనంలో సోమవారం తీవ్ర ప్రమాదం సంభవించింది. చూస్తుండగానే భవనంలోని వాక్‌వే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో వాక్‌వేపై నడుస్తున్న వాళ్లు హాహాకారాలు చేస్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో 72 మంది గాయపడ్డారు. ఇందులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్టడీ టూర్‌లో భాగంగా విద్యార్థులు జకార్తాలోని స్టాక్ ఎక్స్చేంజ్‌ను సందర్శించడానికి వచ్చారు. వివిధ కార్యాలయాలతో నిత్యం రద్దీగా ఉండే బహుళ అంతస్తుల(32) భవనాన్ని సందర్శిస్తుండగా.. ఒక అంతస్తులోని వాక్‌వే ఒక్కసారిగా కూలిపోయింది. వాక్‌వేపైకి పెద్దసంఖ్యలో విద్యార్థులు రావడంతో కూలినట్టు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనేకమంది పర్యాటకులు, ఇతర ఉద్యోగులను ఖాళీ చేయించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు భోజన విరామం కావడంతో స్టాక్ ఎక్సేంజ్ ఉద్యోగులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
జకార్తాలో అత్యంత ఆధునిక భవనాలలో ఒకటైన స్టాక్ ఎక్చ్సేంజ్ భవనం కుప్పకూలడం స్థానికంగా ఆందోళన రేపింది. ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. స్టాక్ ఎక్చ్సేంజ్ డైరెక్టర్ ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇదే భవనంలో ప్రపంచ బ్యాంకు సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రాణనష్టం ఎంత అనేది అధికారికంగా పోలీసులు ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఈ ప్రమాదంపై ఇప్పటికే ట్విట్టర్‌లో వీడియోలు, పోస్ట్‌లు వెల్లువెత్తాయి.



