
ఖైదీలను తిట్టాడని జవానుకు జైలు శిక్ష
జెరుసలేం: ఖైదీలను తిట్టాడని ఇజ్రాయెల్లో జవానుకు జైలు శిక్షను విధించారు. జైల్లోని ఖైదీలను ఆయన తిట్టాడని, కొట్టాడని, కరెంట్ షాక్ కూడా ఇచ్చాడని పేర్కొంటూ మిలటరీ కోర్టు ఆ జవానుకు ఏడు నెలల జైలు శిక్షను విధించింది. తమ దగ్గర ఉన్న చట్టాల ప్రకారం ఇలాంటి చర్యలు తీవ్ర నేరం అని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఆర్మీ) తెలిపిన వివరాల ప్రకారం జైలులో ఉన్న పాలస్తీనా ఖైదీలపట్ల ఆ జవాను కఠినంగా ప్రవర్తించేవాడని, వ్యక్తిగతంగా వారిని తన వద్దకు పిలుచుకొని ఇష్టమొచ్చినట్లు తిట్టడమే కాకుండా వారిని చిత్ర హింసలకు గురిచేశాడని, వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చాడని తమ పరిశీలనలో వెల్లడైనట్లు చెప్పారు. దీంతో పలుమార్లు పాలస్తీనా ఖైదీలు జైలును బద్ధలు కొట్టి పరారై పోయేందుకు ప్రయత్నించారని, దీనంతటికి ఆ జవాను చర్యలే కారణమని తెలిపారు. అందుకే, అతడికి జైలు శిక్షను విధించినట్లు వివరించారు.