కమలా దేవి హారిస్ (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్: వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థిగా పోటీ చేసే అంశాన్ని తోసి పుచ్చలేనంటూ భారత సంతతికి చెందిన కమలా దేవి హారిస్ ప్రకటించి అమెరికా రాజకీయాల్లో ఓ మోస్తరు చర్చకు తెరతీశారు. తన రాజకీయ భవిష్యత్ గురించి, అత్యున్నత పదవికి పోటీపడడం గురించి ఆమె ప్రకటించడం ఇదే తొలిసారి. ఎమ్మెస్‌ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్ష పదవికి పోటీచేసే విషయం కొట్టివేయలేను అని స్పష్టంచేశారు. ప్రస్తుతానికి డెమొక్రాటిక్ పార్టీ నుంచి ఆ దేశ అత్యున్నత స్థానానికి పోటీ చేసేందుకు బెర్రీ సాండర్స్, ఎలిజిబెల్ వారెన్, కొరీ బూకర్ తదితరులకు అవకాశం ఉంది.
ఎన్నో ఫస్ట్‌లు...
భారతీయ–ఆఫ్రికన్ మిశ్రమ సంతతికి చెందిన మొదటి అమెరికన్ సెనేటర్‌గా 2016లో ఎన్నికైన ఆమె అంతకు ముందు కాలిఫోర్నియా అటర్నీ జనరల్‌గానూ ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో వలసపౌరుల హక్కులు పరిరక్షించే వ్యక్తిగా ఆదరణ పొందారు. తల్లీ,బిడ్డలను వేరేచేసేలా అమెరికా సరిహద్దుల్లో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలుచేయడాన్ని ‘మానవత్వంపై దాడి’గా ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వీరి హక్కుల కోసం పోరాడిన అనుభవం అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆమెకు కలిసి రావొచ్చునని భావిస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) చట్టంపై మన వైఖరేమిటంటూ స్వపక్షం డెమొక్రాట్లను కూడా ఆమె సవాల్ చేసి ఇరుకునపెట్టారు.
నేపథ్యమిదీ...
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా–బర్కిలీలో న్యూట్రిషన్, ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం కమల తల్లి శ్యామలా గోపాలన్ చెన్నై నుంచి అమెరికా వెళ్లారు. అక్కడే జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో పరిచయం పెళ్లికి దారితీసింది. తాత పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆ తర్వాత దౌత్యాధికారిగా పనిచేశారు. అమ్మమ్మ కూడా మహిళలకు కుటుంబ నియంత్రణ హక్కు కలిగి ఉండాలనే ప్రచారంలో పాల్గొన్నారు. 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో కమల జన్మించారు. చిన్నతనంలో తరచుగా చెన్నైకు వస్తుండడం వల్ల తాత ప్రభావం ఆమెపై పడింది.
తండ్రి ఆఫ్రికా సంతతికి చెందినవాడు కావడంతో, అటు ఆఫ్రికా, ఇటు ఆసియా సంస్కృతుల కలబోతగా ఆమె నిలుస్తోంది. మిశ్రమ సంస్కృతి కారణంగా ఆమెను రాజకీయంగా బరాక్ ఒబామాతోనూ పోల్చేవారు. 1986లో హోవార్డ్ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశాక, హేస్టింగ్ కాలేజీ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో డిస్ట్రిక్ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి,దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. 2011–17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2014లో డగ్లస్ ఎమ్‌హోఫ్‌ను పెళ్లిచేసుకున్నారు. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలకబాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment