ఊపిరితో గ్లూకోజ్ మోతాదు తెలుసుకోవచ్చా?
మధుమేహ బాధితులకు శుభవార్త. రక్తంలో గ్లూకోజ్ మోతాదును పరీక్షించుకునేందుకు రోజూ సూదితో గుచ్చుకుంటున్నారా? అయితే మీ కష్టాలకు త్వరలోనే చెల్లుచీటీ పాడేయొచ్చంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు. మనం వదిలే ఊపిరి ద్వారానే గ్లూకోజ్ మోతాదును లెక్కవేయొచ్చని పరిశోధన పూర్వకంగా ఓ అంచనాకు వచ్చారు.
సాధారణ ప్రజల నిశ్వాసాల్లో ఇసోప్రీన్ అనే వాయువు చాలా కొద్ది మోతాదులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉండే వారిలో చాలా ఎక్కువగా ఉంటుందని.. ఎనిమిది మంది టైప్-1 మధుమేహ బాధితులపై జరిపిన అధ్యయనం ద్వారా స్పష్టమైంది. కొలెస్ట్రాల్ తయారీలో భాగంగా ఈ వాయువు ఉత్పత్తి అవుతుందని ఇప్పటికే తెలిసినప్పటికీ.. రక్తంలో గ్లూకోజ్ మోతాదు తగ్గడానికి దీనికి సంబంధం ఏమిటన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇసోప్రీన్ వాయువుతో మనకొచ్చిన ఇబ్బందేమీ లేకపోయినా.. కుక్కలకు మాత్రం ఈ వాసనంటే అస్సలు పడదు. అందుకే ఈ రకమైన హైపోగ్లైసీమియాతో బాధపడే వారిని కుక్కలు ఇట్టే పసిగట్టి దూరంగా జరుగుతాయి. ఈ లక్షణాన్ని మరింత అర్థం చేసుకోగలిగితే రక్తంలో గ్లూకోజ్ మోతాదు ఎంత ఎక్కువైందన్నది తెలుసుకోవచ్చని.. మందుబాబులను పట్టుకునేందుకు వాడే బ్రీత్‌ఎనలైజర్ వంటి పరికరాలను తయారు చేయవచ్చని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు అంటున్నారు.