ట్యూనీషియాలోని ఓ భూగర్భ గృహం
నేషనల్ డెస్క్: సాధారణంగా మనకు ఎండ ఎక్కువగా ఉందనిపిస్తే ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుంటాం. యూరప్, అమెరికా వంటి చలితీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఏడారులకు సమీపంలో నివసించే ప్రజలు ప్రతిరోజూ ఈ రెండురకాల వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఫ్రికా దేశమైన ట్యూనీషియాలో జెబెల్‌దహార్‌లోని గ్రామాల్లో నివసిస్తున్న బెర్బెర్ జాతి ప్రజలు ఈ సమస్యకు తమదైన పరిష్కారాన్ని కనుగొన్నారు.
సహారా ఎడారికి సమీపంలో ఉండటంతో పగటి పూట వడగాలుల్ని, రాత్రిపూట తీవ్రమైన చలిని తట్టుకునేందుకు వీలుగా నేలను తవ్వి గుహల్లాంటి ఇళ్లను నిర్మించుకున్నారు. వలయాకారం మధ్యలో ఖాళీ ప్రదేశంతో పగలు, రాత్రి స్థిరమైన ఉష్ణోగ్రత ఉండేలా ఈ ఇళ్లను అక్కడి ప్రజలు తీర్చిదిద్దుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఇళ్లను అక్కడి కుటుంబాలు వారసత్వంగా కాపాడుకుంటున్నాయి. సౌర విద్యుత్ సాయంతో రాత్రిపూట ప్రజలు తమ పనుల్ని చక్కబెట్టుకుంటున్నారు.
పట్టణీకరణ ప్రభావంతో..
స్థానికులు ప్రధానంగా యువత ఉపాధిని వెతుక్కుంటూ పట్టణాలకు వలసవెళుతుండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రజలు లేక వెలవెలబోతోంది. ఇళ్లతో అనుబంధం పెనవేసుకున్నవారు మాత్రం వదిలివెళ్లట్లేదు. ఈ విషయమై స్థానికురాలు లతీఫా బిన్ యహ్యా(38) మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్న, అమ్మ చనిపోయారు. నా కుమార్తెలు వివాహం చేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఐదు గదులున్న ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా.
ఇప్పుడు నేను ఈ ఇంటిని వదిలేస్తే ఇల్లు మాదికాకుండా పోతుంది’ అని తెలిపారు. మరికొందరు కొత్త ఇళ్లను నిర్మించుకుని ఈ భూగర్భ గృహాలను స్టోర్‌రూమ్‌లుగా మార్చుకుంటున్నారని ఆమె వెల్లడించారు. ఫ్రాన్స్ నుంచి 1956, మార్చి 20న స్వాతంత్య్రం పొందిన తర్వాత అధ్యక్షుడు హబీబ్ బోర్గిబా 1960,70 దశకాల్లో చేపట్టిన సంస్కరణల ప్రభావంతో పలువురు బెర్బెర్ జాతి ప్రజలు ఈ భూగర్భ ఇళ్లను వదలి పట్టణాలకు వలస వెళ్లారు. అయితే తమ జాతిని విచ్ఛిన్నం చేసేందుకే అధ్యక్షుడు హబీబీ అప్పట్లో ఈ మార్పులు తీసుకొచ్చాడని పలువురు స్థానికులు ఆరోపించారు.
ఆదాయంపై విప్లవ పంజా
1977లో వచ్చిన ‘స్టార్ వార్స్’ సినిమా కోసం ఓ హోటల్ సెట్‌ను ఇక్కడ వేయడంతో ప్రత్యేకమైన నిర్మాణశైలితో ఉన్న ఈ భూగర్భ ఇళ్లకు అంతర్జాతీయంగా సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. అప్పటివరకూ ఆలివ్, పామ్‌జాతి(ఈత,ఖర్జూర) చెట్ల సాగుపై ప్రధానంగా ఆధారపడ్డ స్థానికులు.. పర్యాటకుల కోసం హోటళ్లు ఏర్పాటుచేసి అదనపు ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెట్టారు.
అయితే 2011లో చెలరేగిన ‘అరబ్ విప్లవం’తో పరిస్థితి తారుమారైంది. విదేశీ పర్యాటకులపై ట్యూనీషియాలో దాడులు పెరిగిపోవడంతో వారి రాక తగ్గిపోయింది. ఆదాయం తగ్గిపోవడంతో పాటు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న తీవ్రమైన కరువు, భారీ వర్షాలను తట్టుకోలేక పలువురు ప్రజలు ఈ ఇళ్లను వదిలి మెరుగైన జీవితం కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో చివరి భూగర్భ గృహాన్ని తాను 1970లో నిర్మించానని అలీ కయెల్ అనే వ్యక్తి చెప్పారు.
ఆస్ట్రేలియాలో కూడా
ఆస్ట్రేలియాలోని కూబర్‌పెడీ పట్టణంలోనూ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొండల్ని ఆనుకుని ఇలాంటి నిర్మాణాలే వెలిశాయి. 1915లో ఏర్పడిన ఈ పట్టణంలో ప్రస్తుతం 3,500 మంది ప్రజలుండగా వీరిలో 60 శాతం మంది కొండల్ని తొలిచి భూగర్భంలో నిర్మించిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం ఓపల్(ఓ రకమైన విలువైన రాయి) ఇక్కడే లభ్యమవుతోంది. కప్పడోసియా ఇళ్లు (టర్కీ), వర్జెడియా కేవ్ సిటీ(జార్జియా), కండోవన్(ఇరాన్) లలోనూ ఇలాంటి ఇళ్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment