వైఫై కన్నా వందరెట్లు వేగంతో లైఫై..
లైఫై ఇప్పుడు వైఫై కి దీటుగా మార్కెట్లోకి రాబోతోంది. 2011 లో లాబ్ లో కొత్తగా ఆవిష్కృతమై... 224 గిగాబైట్స్ వేగంతో పలు పరీక్షల అనంతరం ప్రపంచానికి పరిచయం కాబోతోంది. కార్యాలయాలు, పారిశ్రామిక వాతావరణంలో శాస్త్రవేత్తలు లైఫై పై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎల్ ఈ డీ లైట్ల కాంతి తరంగాలతో ఈ కొత్త వ్యవస్థ.. కమ్యూనికేషన్ కు ఎంతో ఉపయోగంగా ఉండటంతోపాటు.. సురక్షితంగా కూడ ఉంటుందని భావిస్తున్నారు.
'విజిబుల్ లైట్ కమ్యూనికేషన్' తో పనిచేసే కొత్త లైఫై... వైఫై కన్నా వంద రెట్టు వేగంగా పనిచేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. కాంతిని ఉపయోగించి సమాచారాన్ని డేటాగా ప్రసారం చేసేందుకు ఇప్పుడు ట్వాలిన్, ఎస్టోనియాలోని కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో దీన్ని పరీక్షించారు. ఈ లైఫై...లో ఇంటర్నెట్ వినియోగంలోనే విప్లవాత్మక మార్పును తెచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త వైర్ లెస్ వ్యవస్థలో 400 నుంచి 800 టెరాహెడ్జ్ స్పీడ్ తో (సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో) కాంతి.. బైనరీ కోడ్ లో సందేశాలను బదిలీ చేస్తుంది. ఈ విజిబుల్ లైట్ గోడలనుంచి ప్రసారం కాదు. పైగా సురక్షితంగా ఉండటంతోపాటు ఎటుపడితే అటు ప్రసరించేందుకు వీలుగా ఉంటుంది. ఈ వ్యవస్థ ఇప్పటికిప్పుడు వైఫైని భర్తీ చేయకపోయినా.. కొద్ది రోజుల్లో దానికి దీటుగా పనిచేసే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు.
స్కాట్ ల్యాండ్ ఎడిన్ బర్గ్ విశ్వ విద్యాలయానికి చెందిన హెరాల్డ్ హాస్ 2011 లో లైఫైని కొత్తగా కనుగొన్నారు. ఒకే ఎల్ ఈ డీ నుంచి ప్రసారమయ్యే మినుకు మినుకుమనే కాంతి ద్వారా సెల్యులార్ టవర్ కంటే ఎక్కువగా డేటా ప్రసారం అవుతుందని హాస్ ప్రదర్శించారు. మోర్స్ కోడ్ మాదిరిగానే ఈ వ్యవస్థ కాంతిని ఉపయోగించి ప్రసారం చేసినా.. కంటితో గుర్తించలేనంత వేగంతో కమ్యూనికేషన్ నడుస్తుందని చెప్తున్నారు. ఈ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పలు పైలట్ ప్రాజెక్ట్ లను నిర్వహించిన పరిశోధకులు...ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతంలో సులభంగా ప్రసారాలకోసం ఓ స్మార్ట్ లైట్ సొల్యూషన్ ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు.
ఈ సురక్షిత వైర్ లెస్ యాక్సిస్ కోసం హాస్ టీమ్ ఓ ప్లే ప్లగ్ ను, అప్లికేషన్ ను రూపొందించారు. 'ఒలెడ్ కాం' అనే ఓ ఫ్రెంచ్ సంస్థ లైఫై వాడకంతోపాటు.. ఈ వ్యవస్థను స్థానిక ఆసుపత్రుల్లో కూడ ఇన్ స్టాల్ చేసింది. ఈ లైఫై వైర్ లెస్ డేటా ట్రాన్స్ మిషన్ భవిష్యత్తును మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా చేస్తుందని సైంటిస్ట్ హాస్ ఆశిస్తున్నారు.