![పైలట్.. దారి మర్చిపోయాడు! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41451282796_625x300.jpg.webp?itok=lhFaO437)
పైలట్.. దారి మర్చిపోయాడు!
రోడ్డుమీద కారులో వెళ్తుంటే ఒకోసారి మనం సరిగా దారి తెలియక తప్పిపోతాం. అదే విమానాలైతే.. వాటికి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కచ్చితంగా వెళ్తాయి. కానీ, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం న్యూజిలాండ్ నుంచి బయల్దేరి, దాదాపు గంట పాటు తప్పుడు దిశలో వెళ్లిపోయింది! ఎంహెచ్132 అనే ఈ విమానం ఆక్లండ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలి. అందుకు ఆస్ట్రేలియా మీదుగా వాయవ్య దిశలో నేరుగా వెళ్లాలి.
కానీ, రాడార్ డేటాను బట్టి చూస్తే.. అది దక్షిణ దిశగా దాదాపు గంటపాటు ప్రయాణించినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పైలట్లు.. ఆక్లండ్ ఓషియానిక్ కంట్రోల్ సెంటర్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లతో చర్చిస్తున్నా, ప్రయాణికులకు మాత్రం చెప్పలేదు. విమానం ఇలా వెళ్లడం వల్ల దానికి ప్రమాదం ఏమీ రాలేదుగానీ, అసలు సాధారణంగా వెళ్లాల్సిన మార్గాన్ని ఎందుకు మార్చారనే దానిపై విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు.