‘అతని తలరాతని విధి మలుపు తిప్పింది’ | Man Drowns While Proposing to His Girlfriend Underwater | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి ప్రపోజ్‌ చేస్తూ.. ప్రాణం వదిలాడు

Published Mon, Sep 23 2019 2:42 PM | Last Updated on Mon, Sep 23 2019 4:00 PM

Man Drowns While Proposing to His Girlfriend Underwater - Sakshi

వాషింగ్టన్‌: మది దోచిన నెచ్చలికి తన మనసులో మాట చెప్పి.. ఆమె వెచ్చని కౌగిలిలో సేద దీరాలని భావించిన అతడిని మృత్యువు తన బిగి కౌగిలిలో శాశ్వతంగా బంధించింది. ప్రియుడి నోటి నుంచి ప్రేమిస్తున్నాను అనే మాట విని సంతోషంలో మునిగిపోయిన ఆ యువతి.. మరు నిమిషంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామానికి గుండె పగిలేలా రోదిస్తుంది. వివరాలు.. అమెరికా లూసియానాకు చెందిన స్టీవ్‌ వెబర్‌, కెనేషా అనే యువతిని గత కొద్ది కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం విహారయాత్ర నిమిత్తం వీరిద్దరు టాంజేనియా వెళ్లారు. అక్కడే స్టీవ్‌, కెనేషాకు ప్రపోజ్‌ చేయాలని భావించాడు. సాధారణంగా మోకాళ్ల మీద కూర్చుని.. ఉంగరం పట్టుకుని.. ‘విల్‌ యూ మ్యారీ’ అని అడగడం స్టీవ్‌కు ఇష్టం లేదు. దాంతో కాస్తా వెరైటీగా ప్రయత్నిద్దామని చెప్పి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నీటి లోపల ప్రపోజ్‌ చేద్దామని అనుకుని.. సముద్రంలోకి దూకాడు స్టీవ్‌. ఆ తర్వాత బోటులో తాము ఉంటున్న క్యాబిన్‌ దగ్గరకు వెళ్లి ఉంగరాన్ని బయటకు తీసి, ఐ లవ్‌ యూ, విల్‌ యూ మ్యారీ మీ అని ఉన్న లెటర్‌ని చూపిస్తూ కెనేషాకు ప్రపోజ్‌ చేశాడు.

అటు కెనేషా కూడా సంతోషంతో స్టీవ్‌ ప్రతిపాదనకు అంగీకరించింది. ఇంకేముంది కథ సుఖాంతం అయ్యింది అనుకుంటుండగా.. అనుకోకుండా స్టీవ్‌ జీవితం తలకిందులయ్యింది. ప్రపోజ్‌ చేయడం కోసం నీటిలో మునిగిన స్టీవ్‌ మరిక బయటకు రాలేదు. అతడు నీటిలో మునిగి చనిపోయాడు. ఓ నిమిషం క్రితం వరకు సంతోషంగా సాగిన స్టీవ్‌ జీవితం.. అలా అనూహ్యంగా ముగిసి పోయింది. జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగలాల్సిన రోజు కాస్త పీడకలగా మారిపోయింది. కెనేషా బాధ అయితే వర్ణనాతీతం. ‘విధి స్టీవ్‌ జీవితంతో ఆడుకుంది. సంతోషంగా సాగుతున్న తరుణంలో స్టీవ్‌ జీవితం కృరమైన మలుపు తిరిగింది. మా జీవితంలో ఉత్తమంగా నిలవాల్సిన రోజు.. చెత్తగా మిగిలిపోయింది. స్టీవ్‌ నీవు ఆ లోతుల నుంచి ఎన్నటికి బయటకు రాలేవు. కాబట్టి నా సమాధానాన్ని కూడా వినలేవు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. కొన్ని లక్షల సార్లు నీ ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతున్నాను. ప్లీజ్‌ స్టీవ్‌ నా కోసం వచ్చేయ్‌’ అంటూ కెనేషా హృదయవిదారకంగా రోదిస్తుంది. తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఈ విషాదంత కథనం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement