ఫేస్బుక్ లైవ్ వీడియో తీస్తుండగా కాల్చివేత
న్యూయార్క్ : అమెరికాలో ఫేస్బుక్ లైవ్ వీడియో చిత్రీకరణ సందర్భంగా ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. చికాగోలో స్నేహితులతో కలిసి ఫేస్ బుక్ కోసం లైవ్ వీడియో తీస్తున్న సందర్భంలో దుండగులు ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆంటానియో పెర్కిన్స్ (28) దారుణ హత్యకు గురయ్యాడని సీబీఎస్ న్యూస్ రిపోర్టు చేసింది. చికాగో కు చెందిన పెర్కిన్స్ దురదృష్టవశాత్తూ తన మరణాన్ని తనే చిత్రీకరించుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కాల్పుల ఘటనలో నెలకొన్న గందరగోళమంతా ఆ వీడియో లో రికార్డయింది.
వివరాల్లోకి వెళితే ఇద్దరు పిల్లల తండ్రి అయిన పెర్కిన్స్ ఫ్రెండ్స్ తో కలిసి లైవ్ స్ట్రీమింగ్ డాక్యుమెంటరీ షూటింగ్ చేస్తున్నాడు.. ఇంతలో ఓ ముఠా అతని తల, మెడపై కాల్పులు జరిపింది. దీంతో పెర్కిన్స్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అతణ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
అయితే ఈ ఘటనపై పెర్కిన్స్ తండ్రి డానియల్ కోల్ స్పందిస్తూ అన్యాయంగా తన కొడుకును ఆ ముఠా పొట్టన పెట్టుకుందని వాపోయారు. తన కుమారుడికి ఎలాంటి అవాంఛిత కార్యక్రమాలతో సంబంధం లేదన్నారు. తను చాలామంచివాడని.. అందరికీ అతనంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. మెక్ డోనాల్డ్స్ లో పని చేస్తూ పిల్లల్ని పోషించుకుంటున్నాడని తెలిపారు. కొడుకు మరణంతో పిల్లలు అనాధలైపోయారని వాపోయారు. మరోవైపు పెర్కిన్స్ షూట్ చేసిన లైవ్ వీడియోలో ముఠాకు చెందిన దృశ్యాలు ఉన్నాయని..వారే ఈ దుశ్చర్యకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. వీడియోను స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.
కాగా ఫేస్బుక్ లైవ్ వీడియో చిత్రీకరణ సందర్భంగా...ఈ ఏడాది మార్చిలో దాదాపు ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. 31 ఏళ్ల వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపగా...అతను తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. అప్పటి ఈ వీడియోను దాదాపు 5 లక్షలకు పైగా వ్యూస్, 18 వందల షేర్లు లభించాయి.