
డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే..
మోడలింగ్ ప్రపంచంలో ముందుకు దూసుకుపోవాలంటే అందం, శరీర లావణ్యం ఉంటే సరిపోదని, ఆరోగ్యం కూడా ఎంతో అవసరం అని అంటున్నాయి ఫ్రాన్స్ చట్టాలు. జీరోసైస్ కోసం తిండీ తిప్పలూ మానేసి బక్క చిక్కిపోవడం అందంలోకి రాదని, మోడలింగ్ లో పాల్గోవాలంటే ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉన్నట్లుగా డాక్టర్ సర్టిఫికెట్ కూడ తప్పనిసరి అంటూ ఫ్రాన్స్ కొత్త బిల్లును పాస్ చేసింది. మోడలింగ్ వృత్తిలోకి అడుగు పెట్టేవారు వారి శరీరాకృతికి తగ్గ బరువు కలిగి ఉండాలని సూచించింది. అంతేకాదు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్షతోపాటు 75 వేల యూరోల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.
శరీరాకృతిని బట్టి బరువు ఉండాలంటూ పెట్టిన నిబంధనలపై గతంలో ఫ్యాషన్ ఇండస్ల్రీ... తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే అప్పటినుంచీ ఆ విషయంపై చర్చలు కొనసాగుతుండగా... చివరికి శరీరాకృతిని బట్టి ఆ మోడల్ ఎంత బరువు ఉండాలి అనే విషయాన్ని డాక్టర్లే నిర్ణయించాల్సిందిగా చట్టసభ్యులు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశించాలంటే అందంతోపాటు ఆరోగ్యం... ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండాల్సిన అవసరం ఉంది.
అతి సన్నగా ఉండి... అనోరెక్సియా, బులీమియాలకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉండే కొలతలను ప్రోత్సహించడం నేరం అని, అలా చేసిన వారికి ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తామని గత బిల్లులో కూడ పొందుపరిచిన విషయం తెలిసినదే. అయితే ఫ్రాన్స్ లో సుమారు 30 నుంచి 40 వేల మంది ప్రజలు, కౌమార దశలో అనోరెక్సియా నెర్వోసా, ఈటింగ్ డిజార్డర్ వంటి వాటితో బాధపడుతున్నారు.దీంతో మరణాల రేటు కూడ తీవ్రంగా పెరుగుతోంది. ఇటువంటి అనేక కారణాలను పరిధిలోకి తీసుకున్న ప్రాన్స్ చట్టాలు ఇప్పుడు మోడల్స్ కూ డాక్టర్ సర్టిఫికెట్ అవసరమని తేల్చి చెప్పాయి.