కుక్క బోనులో పది కిలోల హెరాయిన్
న్యూయార్క్: కుక్క బోనులో పది కిలోల హెరాయిన్‌ను దొంగచాటుగా తరలించేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు. బ్రాంక్స్ ఏరియాకు చెందిన శామ్యూల్ సీబ్రూక్స్(35), కార్మెల్‌కు చెందిన బెటన్‌కోర్ట్ మొరేల్స్(27) మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ న్యూయార్క్లో పట్టుబడడ్డారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీబ్రూక్స్, బెటన్‌కోర్ట్ మొరేల్స్ ఇద్దరూ బ్రాంక్స్‌లోని ఓ హోటల్‌లో శుక్రవారం రాత్రి కలుసుకున్నారు. ఇద్దరూ వేర్వేరు వాహనాల్లో న్యూయార్క్ కెన్నడీ ఎయిర్‌పోర్టులోని పార్సిల్ సర్వీస్ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ప్యూర్టోరికో నుంచి బోనుతో సహా వచ్చిన లాబ్రడార్ జాతి కుక్క పార్సిల్‌ను వారు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం మొదటగా బెటన్‌కోర్ట్ మొరేల్స్ లోపలికి వచ్చి కౌంటర్ వద్ద సంతకం చేసి, పార్సిల్‌ను తీసుకోబోయాడు. అయితే, వీరి కదలికలపై కన్నేసి ఉంచిన నిఘా వారు.. లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేశారు.
కుక్క బోనును పరీక్షగా చూడగా అడుగున ప్రత్యేకంగా ఉన్న అరలో దాచిన పది పొట్లాల్లో ఉన్న పది కిలోల హెరాయిన్ బయటపడింది. ఈ మేరకు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను తీసుకువస్తున్న నేరం కింద వారిద్దరికీ సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది.