
దూరం భారం కాదు..
* దక్షిణ అమెరికా దేశాలతో సంబంధాలపై మోడీ
* భారత్‌కు చేరుకున్న ప్రధాని
బ్రసీలియా (బ్రెజిల్): బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాత్రి స్వదేశం చేరుకున్నారు. అంతకుముందు ఆయన దక్షిణ అమెరికా దేశాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దక్షిణ అమెరికా దేశాలతో గతంలో కంటే మరింత సన్నిహితంగా కలసి పనిచేస్తామని చెప్పారు. దానికి ఇరు ప్రాంతాల మధ్య దూరం అడ్డంకి కాబోదన్నారు.
బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుతో అవకాశాలు మరిన్ని పుట్టుకొస్తాయన్నారు. ద్వైపాక్షిక స్థాయిలోనేగాక, బ్రిక్స్, జీ-77తో పాటు ఇతర అంతర్జాతీయ వేదికల సభ్యదేశంగా తాము దక్షిణ అమెరికా దేశాలతో కలసి పనిచేస్తామని ఆయా దేశాల నేతలకు ప్రధాని హామీఇచ్చారు. తమ ఖండంలోని సహ దేశాల నేతలతో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. దక్షిణ అమెరికాలో పెట్టుబడులకు భారత ఇన్వెస్టర్లు పెరగడమే ఆ దేశాల సామర్థ్యానికి సూచిక అన్నారు.
ఈ సందర్భంగా భారతీయ సంతతి అధికంగా నివసించే గయానా దేశ అధ్యక్షుడు రామోతార్‌తో మోడీ సమావేశమయ్యారు. కాగా, వచ్చే ఏడాది ఐబీఎస్‌ఏ (ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) సదస్సుకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో మోడీ సమావేశమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బ్రెజిల్‌లోని భారత రాయభార కార్యాలయంలో న్యాయస్థానం (చాన్సెరీ)ని మోడీ ప్రారంభించారు. భారత్‌కు తిరుగు ప్రయాణంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫుర్ట్‌లో ఆగిన సందర్భంగా జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్‌తో మోడీ ఫోన్‌లో సంభాషించారు. 60వ పడిలో అడుగుపెట్టిన ఆమెకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.