అంతరిక్షంలో అన్నె మెక్లెయిన్
వాషింగ్టన్ : ఇంట్లో మొదలైన పంచాయితీ వీధిలోకి.. అక్కడి నుంచి రచ్చబండపైకి చేరడం చూశాం. కానీ, అమెరికాలోని ఓ జంట పంచాయితీ మాత్రం అంతరిక్షం వరకు వెళ్లింది. నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ)లో పనిచేసే ఆస్ట్రోనాట్ అన్నె మెక్లెయిన్ తన భార్య సమ్మర్ వోర్డెన్‌తో విభేదాలు రావడంతో విడిగా ఉంటోంది. ఇద్దరూ స్త్రీలైనా వీరు భార్యాభర్తలుగా కొనసాగడం గమనార్హం. నాసా స్పేస్ మిషన్‌లో భాగంగా మెక్లెయిన్ ఆరు నెలలపాటు అంతరిక్షంలో గడిపింది. ఆ సమయంలో తన భార్య బ్యాంకు లావాదేవీలను అక్రమంగా తెలుసుకుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు తన కంప్యూటర్‌లోకి మెక్లెయిన్ చొరబడి ఆర్థిక లావాదేవీలు తెలుసుకుందని ఆమె భార్య సమ్మర్ వోర్డెన్ ఆరోపించారు.
ఈ మేరకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) లో ఆమె ఫిర్యాదు చేశారు. అయితే, ఎఫ్‌టీసీ తన ఫిర్యాదుపై స్పందించడం లేదని ఆమె వాపోయారు. ఇక వోర్డెన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నాసా అధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. అయితే, ఇద్దరూ కలిసున్నప్పుడు చేసిన లావాదేవీలను తెలుసుకునేందుకే మెక్లెయిన్ అలా చేసిందని ఆమె తరపు న్యాయవాది చెప్తున్నాడు. మొత్తంమీద భూమి నుంచి ఆకాశానికి తాకిన ఈ పంచాయితీ మొట్టమొదటిదిగా నిలిచిపోనుంది. నేరం నిరూపణ అయితే మెక్లెయిన్‌పై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment