
మంటల ప్రపంచ పటం
ఈ ఏడాది యూరోపియన్ దేశాల్లో ఎండలు మండిపోయాయి..
ఈ ఏడాది యూరోపియన్ దేశాల్లో ఎండలు మండిపోయాయి.. పోతున్నాయి కూడా. ఇంకోవైపు మంచుముద్దలనుకునే సైబీరియా, గ్రీన్‌ల్యాండ్‌లలో వేల ఎకరాల్లో కార్చిచ్చు రేగి.. అడవి మొత్తం బూడిదైంది. ఆ.. ఇవన్నీ ఎక్కడో జరిగేవి కదా అనేవాళ్లూ లేకపోలేదు. అందుకేనేమో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కు చెందిన ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఓ వినూత్నమైన మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఫొటోలో కనిపిస్తున్నది ఆ మ్యాపే. ఏంటి దీని ప్రత్యేకత అంటారా? ఒక్కసారి ఈ మ్యాపును చూస్తే.... కార్చిచ్చులు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది.
మ్యాపులో ఇక మనదేశం ఉన్న చోటును చూడండి. ఒకట్రెండు చోట్ల కొంచెం ఎర్రగా ఉంది! మరి మిగతా అంతా బాగున్నట్టేనా? ఊహూ. మనకు వానాకాలం కాబట్టి ఇలా కనిపిస్తోంది అంతే. ఇక ఈ ఏడాది వేర్వేరు దేశాల్లో చోటు చేసుకున్న విపత్తులు, వాటి తీవ్రత గురించి ఒక లుక్ వేద్దాం. పోర్చుగల్‌లో వేడిగాలుల వల్ల ఏకంగా 64 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ దేశంలోనే ఒకచోట కార్చిచ్చు కారణంగా కొన్ని వేల మంది.. ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయారు. ఇక కెనడాలోనైతే రికార్డు స్థాయిలో దాదాపు తొమ్మిది వేల హెక్టార్ల అటవి నాశనమైపోయింది. ఏతావాతా.. చెప్పొచ్చేది ఏమంటే.. భూమి భగ్గుమంటోంది. మన అలవాట్లు మార్చుకోకపోతే.. భూమ్మీద పచ్చదనం పెంచకపోతే పక్కనున్న మ్యాప్‌లో ఎరుపు రంగు పెరుగుతూనే ఉంటుంది. భూమ్మీద మన మనుగడకే ముప్పు వాటిల్లనుంది!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్