వ్యాపారాన్ని దినదిన ప్రవర్ధమానంగా పరుగులు పెట్టించడమే వ్యాపారవేత్త లక్షణం అనే వాదనకు కాలం చెల్లింది. సమాజంలో చైతన్యాన్ని నింపే నిబద్ధత కలిగిన వ్యాపారవేత్తలు బిజినెస్‌లోనూ, సమాజ పరివర్తనలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం గళం విప్పిన యాపిల్ సీఈవో టిమ్ కుక్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అట్టడుగు వర్గం నుంచి అపర కుబేరుడిగా మారిన స్టార్ బక్స్ వ్యవస్థాపకుడైన కాఫీ వ్యాపార దిగ్గజం హౌవార్డ్ షుల్జ్ అమెరికాలో హింస, వర్ణ వివక్షలపై ఎక్కుపెట్టిన చైతన్య ఉద్యమం ఈనాటి మేటి వ్యాపార రంగానికి, యాక్టివిజానికీ మధ్య తొలగిపోతున్న తెర అని స్పష్టం చేస్తున్నాయి.
సామాజిక చైతన్యం..
వ్యాపారంలో సానుకూల దృక్పథాలను ప్రచారం చేస్తున్న బ్రాండ్ యాక్టివిజమ్, సోషల్ గుడ్ వంటి సామాజిక నిబద్ధతా కార్యక్రమాలు కార్పొరేట్ కంపెనీల సామాజిక చైతన్యానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. వ్యాపార ప్రకటనల్లో మిళితమైన సామాజిక చైతన్యం కార్పొరేట్ కంపెనీల సానుకూల వినూత్న విధానాలకు అద్దం పడుతున్నాయి. ఇటీవల అమెరికాలో జాతీయ పార్కుల పరిరక్షణ కోసం పెంటగోనియా వస్త్ర పరిశ్రమ ‘మీ అధ్యక్షుడు మీ భూమిని దొంగిలిస్తున్నాడు’ అనే నినాదంతో చేపట్టిన ఉద్యమం కాని, అమెరికా అంతర్జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు వివక్షకు నిరసనగా మోకరిల్లిన ఫుట్‌బాల్ ఆటగాడు కోలిన్ కొపర్నిక్ ఆదర్శంగా రూపొందించిన నైక్ అడ్వర్టయిజ్‌మెంట్ కానీ వ్యాపార రంగంలో వెల్లివిరుస్తున్న సమానత్వపు ఆకాంక్షను సాక్షాత్కరిస్తున్నాయి.
తమ వంతు పాత్ర..
కార్పొరేట్ కంపెనీల సీఈవోలు సైతం సామాజిక చైతన్య కరదీపికలుగా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఉదాహరణకు 2015లో పారిస్‌లో వాతావరణ మార్పుల ఒప్పందంపై సంప్రదింపుల సందర్భంగా 14 ప్రధాన ఆహార సంస్థలైన మార్స్, జనరల్ మిల్స్, కోకాకోలా, యూనీలెవర్, దేనన్ డైరీ నార్త్ అమెరికా, హెర్షీ, బెన్ అండ్ జెర్రీ, కెల్లాగ్, పెప్సీకో, నెస్లే, యుఎస్‌ఏ న్యూబెల్జియం బ్రూయింగ్, హెయిన్ సెలెస్టియల్, స్టోనీ ఫీల్డ్ ఫామ్, క్లిఫ్ బార్ కంపెనీలు వాతావరణ మార్పులపై వాస్తవ పరిణామాలను గుర్తించాలనీ, సరైన పరిష్కారం చూపాలంటూ సంయుక్తంగా బహిరంగ లేఖ రాశాయి. ఏడు ఇస్లాం దేశాల నుంచి ప్రజలు అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని తీర్పునివ్వాలంటూ దాదాపు 100 కంపెనీల సీఈవోలు ఫెడరల్ జడ్జీలను కోరారు.
మూస నిర్ణయాలకు చెల్లుచీటీ!
నలుగురు మనుషులు నాలుగు గోడల మధ్య (బోర్డ్‌రూం) కూర్చుని ఏకపక్షంగా చేసే నిర్ణయాల స్థానంలో ప్రజాబాహుళ్యాన్ని చైతన్యం చేస్తూనే వ్యాపారాన్ని కొత్తపుంతలు తొక్కించే కొత్త విధానాలతో వ్యాపార రంగంలో ‘సరైన రాజకీయ’ ఉత్పత్తులకు తలుపులు తెరుస్తూ షేర్‌వాల్యూను సైతం అనూహ్యంగా పెంచేసుకుంటున్నాయి.
కార్పొరేట్ అధిపతుల వైఖరిలో మార్పుకు కారణాలు..
- డొనాల్డ్ ట్రంప్.. 2016 అమెరికా ఎన్నికల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షార్లెట్స్‌విల్లాలో నల్లజాతీయులపై శ్వేతజాతీయుల జాత్యహంకార దాడులను తప్పుపట్టకపోవడాన్ని జనరల్ మోటార్స్, జేపీ మోర్గాన్, వాల్‌మార్ట్ లాంటి ప్రముఖ వ్యాపార సంస్థలు ట్రంప్ ప్రజావిభజన విధానాలను బహిరంగంగా విమర్శించడం వ్యాపారవేత్తల సామాజిక నిబద్ధతను చాటిచెబుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉండటం వ్యాపార సంస్థలకు వీలుకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరైన దృక్పథంతో తమ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం కలగడానికి కూడా ఈ సంస్థలు తమ ప్రచారంలో సామాజిక రాజకీయాంశాలను ప్రస్తావిస్తున్నాయి.
- అరబ్ స్ప్రింగ్ (అరబ్ దేశాల్లో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన విప్లవం) అమెరికాలో జరిగిన ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ వంటి అనేకానేక ఉద్యమాల్లో ప్రజలు వీధుల్లోకొచ్చి పోరాడారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. వీధుల్లోకి వచ్చే పరిస్థితుల్లేవు. బహిరంగ ప్రదేశాల్లో అడుగడుగునా పాలకుల పర్యవేక్షణ, నిఘా, పోలీసులు, సైన్యాలను మోహరించడం పెరిగిపోయింది. దాంతో చైతన్యవంతులు బహిరంగ ఉద్యమాలవైపు వచ్చే అవకాశం తగ్గింది. నిరసన గళాలను వినిపించేందుకు మరోదారి వెతుక్కోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే పని ప్రదేశాల్లాంటి కొత్త ప్రదేశాలను కనుక్కున్నారు. అక్కడి నుంచే తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని ప్రభావం సంస్థ యాజమాన్యాలపై కూడా పడుతోంది.
- లెక్కలేనంత మందికి తమ అభిప్రాయాలు చేరవేయడానికి వేదికలుగా ఉపయోగపడుతున్న ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాలు గతంలో లేవు. సాంకేతిక పురోగతి కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థను నియంత్రించగలిగే ఆస్కారం ఇప్పుడు పాలకులకు లేదు. తమ చైతన్య స్రవంతిని అందరితో పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలు శక్తిమంతమైన ఆయుధాలుగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment