
వాషింగ్టన్ : ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినంత కాలం పాకిస్తాన్‌కు అమెరికా ఎటువంటి సహాయం చేయకూడదని ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ‘ ఉగ్రవాదులకు ఎన్నో ఏళ్లుగా పాక్ ఆశ్రయమిస్తోంది.ఇలా చేసినంత కాలం ఇస్లామాబాద్‌కు అమెరికా నుంచి ఒక్క డాలర్ కూడా ఆర్థిక సహాయం అందదు. సహాయం చేసినందుకు, దయా గుణానికి ప్రతిఫలంగా అమెరికా కేవలం ఉగ్రవాదాన్ని రూపుమాపాలని మాత్రమే కోరుతోంది. కానీ అమెరికా, ఐరాస జోక్యాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తూనే ఉంది’ ఓ పత్రికా వ్యాసంలో నిక్కీ హేలీ రాసుకొచ్చారు.
పాక్ మిలిటరీకి ఎక్కువ శాతం నిధులు..
అమెరికా రక్షణను బలోపేతం చేసేందుకు ‘స్టాండ్ ఫర్ అమెరికా నౌ’ అనే నూతన పాలసీ గ్రూపును నిక్కీ హేలీ ప్రారంభించారు. ఇందులో భాగంగా.. ‘ 2017లో పాకిస్తాన్‌కు సుమారు 1 బిలియన్ డాలర్ల నిధులు అమెరికా సమకూర్చింది. ప్రపంచ దేశాల్లో అమెరికా సాయం పొందిన వాటిలో పాక్ ఆరో స్థానంలో ఉంది. అమెరికా అందించిన ఆర్థిక సహాయంలో ఎక్కువ శాతం నిధులు పాక్ తమ మిలిటరీకి వినియోగించింది. ప్రజల కోసం రోడ్లు, ఎనర్జీ ప్రాజెక్టులకు మిగిలిన మొత్తాన్ని ఉపయోగించింది. ఇంత చేసినా.. ఐరాసలో ప్రధాన అంశాలపై జరిగిన ఓటింగ్‌లో పాక్ అమెరికాను 76 శాతం వ్యతిరేకించింది. అంతేకాదు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్‌లో మోహరించిన అమెరికా దళాలను హతమార్చేందుకు పరోక్షంగా సహాయం అందించింది. వారికి కృతఙ్ఞత లేదు’ అని పాక్ తీరును ఎండగట్టారు. పాకిస్తాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నిక్కీ ప్రశంసలు కురిపించారు. అయితే ఉగ్రవాదులను అంతమొందించేందుకు అమెరికా ఇంకాస్త కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
కాగా పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా పూర్తి చేసి...పాక్‌కు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏవిధంగా మారతాయోనన్న అంశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment