
9 వేల డాలర్లు... గుటకాయ స్వాహా
భర్త మీద కోపంతో దాచుకున్న డబ్బు మొత్తాన్ని అమాంతం మింగేసిందో భార్య. కొలంబియాలోని బుకర్మంగాకు చెందిన 28 ఏళ్ల శాండ్రా మిలెనా అనే ఒక యువతి ఈ నెల 22న విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. తొలుత గ్యాస్ట్రిక్ సమస్యగా భావించిన వైద్యులు ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. కానీ శస్త్రచికిత్సలో వైద్యులను నివ్వెరపరిచే ఒక దృశ్యం కనిపించింది. ఆమె కడుపు నిండా 100 అమెరికన్ డాలర్ల కరెన్సీతో నిండిపోయి ఉంది. వైద్యులు దాదాపుగా డబ్బు మొత్తాన్ని బయటకు తీసివేశారు. అలా తీసివేయగా వచ్చిన డబ్బు 5,700 డాలర్లు (రూ. 3.66 లక్షలు) వచ్చింది. దీంతో వైద్యులు వెంటనే పోలీసులను పిలిపించారు.
పోలీసులు సదరు యువతిని విచారించగా అందరూ నిర్ఘాంతపోయే వాస్తవాన్ని పోలీసులకు తెలిపింది. తాను, తన భర్త పనామాకు వెళ్లి చక్కని జీవితాన్ని గడపాలని భావించినట్లు, దానికోసం ఇద్దరం కలిసి కొంత సొమ్మును కూడబెట్టినట్లు చెప్పుకొచ్చింది. అయితే తమ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని తెలిపింది. దీంతో తామిద్దరం విడిపోవాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కూడబెట్టిన డబ్బుతో పాటు, ఫర్నీచర్, మోటార్‌సైకిల్ అమ్మగా వచ్చిన డబ్బును చెరిసగం పంచుకోవాలని తన భర్త ప్రతిపాదించాడని తెలిపింది. దీనికి తాను ఒప్పుకున్నట్లే నటించి ఆ డబ్బు తన భర్తకు దక్కకూడదనే కోపంతో కరెన్సీ మొత్తాన్ని మింగేశానని చెప్పింది. శాండ్రా మింగిన మొత్తం 9 వేల డాలర్లు (రూ. 5.78 లక్షలు) విలువ చేసే 100 డాలర్ల కరెన్సీ కావడం గమనార్హం.