న్యూయార్క్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని 2013లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని చెప్పారు. చైనాలో ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తగ్గిన తరహాలోనే ప్రపంచ దేశాల్లోనూ కరోనా విస్తృతి మందగిస్తుందని ఆయన పేర్కొన్నారు. చైనా తరహాలోనే అమెరికా సైతం త్వరలోనే కరోనా వ్యాప్తి నుంచి విముక్తి పొందుతుందని, ఇది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సమయం కంటే ముందే జరుగుతుందని లెవిట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే ఆయన ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను నిశితంగా అథ్యయనం చేస్తున్నారు. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు భయాందోళనలను అధిగమించాలని, సామాజిక దూరం పాటించడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు.
వాస్తవానికి దగ్గరగా లెవిట్ అంచనాలు
కరోనా వైరస్‌తో చైనాలో దాదాపు 80,000 కేసులు నమోదవుతాయని, 3,250 మరణాలు సంభవిస్తాయని లెవిట్ ఫిబ్రవరిలోనే అంచనా వేయగా, సరిగ్గా చైనాలో అదే సంఖ్యలో 80,298 కేసులు, 3245 మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ముమ్మరంగా సాగినా మార్చి 16 నుంచి నూతన రోగుల సంఖ్య స్వల్పంగా ఉందని గుర్తుచేశారు. ఈ మహమ్మారిని రూపుమాపే దిశగా మనం సరైన దిశలోనే సాగుతున్నామని లాస్‌ఏంజెల్స్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చారు. 78 దేశాల నుంచి ప్రతిరోజూ కొత్తగా నమోదయ్యే 50కి పైగా కేసులను ఆయన విశ్లేషిస్తూ వైరస్ వ్యాప్తిలో కొంత రికవరీ కనిపిస్తోందని అంచనా వేశారు.
మొత్తం కేసుల సంఖ్యను ఆయన పరిగణనలోకి తీసుకోకుండా రోజూ కొత్తగా నమోదయ్యే కేసుల్లో తగ్గుదలను ఆయన ప్రధానంగా పరిశీలిస్తున్నారు. కేసుల సంఖ్య ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నా ఈ వైరస్ వ్యాప్తి బలహీనపడుతున్నదనేందుకు స్పష్టమైన సంకేతాలు ఉఆన్నయని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాజిక దూరం పాటించడం, వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడం రెండూ కీలకమని అన్నారు. మొత్తం కరోనా కేసుల సంఖ్యను, కరోనా పాజిటివ్‌గా తేలిన సెలబ్రిటీలను ఫోకస్ చేస్తూ మీడియా ప్రజలను అనవసరంగా భయాలకు లోనుచేస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ బాధితులతో ఆస్పత్రులు నిండిపోవడంతో సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ను అడ్డుకోవడం మంచిదని సూచించారు.
చదవండి : ‘ఫిబ్రవరి నెలాఖరు నుంచే ముందు జాగ్రత్త చర్యలు’
అతిగా స్పందిస్తే అనర్ధం
కరోనా వైరస్ వ్యాప్తిపై అతిగా స్పందించడం మరో సంక్షోభానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనవసర భయాందోళనలతో నిరుద్యోగానికి దారితీయడం, ఆత్మహత్యలు పెరగడం వంటి విపరీత ధోరణులు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి ప్రతికూల ప్రభావాలనూ తోసిపుచ్చలేమన్నారు. ఫ్లూ కంటే ఈ వైరస్‌తో మరణాల రేటు ఎక్కువగా ఉన్నా ఇది ప్రపంచ అంతానికి దారితీయదని, వాస్తవ పరిస్థితి చెబుతున్నంత భయానకంగా లేదని లెవిట్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment