
ఒబామా క్రెడిట్ కార్డు.. గోవిందా!
మీకు క్రెడిట్ కార్డు ఉందా? దాన్ని వాడేందుకు వెళ్తే.. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? మీరేంటి.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా తన క్రెడిట్ కార్డుతో ఇబ్బంది పడ్డారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు ఒబామా న్యూయార్క్ వెళ్లారు. తీరా అక్కడ ఏదో హోటల్లో క్రెడిట్ కార్డు వాడదామని చూస్తే.. ఆ కార్డు తిరస్కరణకు గురైంది. ఇలా ఎందుకు జరిగిందో ఒబామాకు కాసేపు అర్థం కాలేదు. విషయం ఏమిటంటే.. ఆయన క్రెడిట్ కార్డును ఎవరో క్లోన్ చేసి వాడేశారని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరోలో చెప్పారు. క్రెడిట్ కార్డు మోసాల్లాంటి విషయాల గురించి ఆయన వివరించారు.
తాను పెద్దగా వాడకపోయినా అప్పుడే లిమిట్ ఎలా అయిపోయిందా అనుకున్నానని, అప్పుడు తనకు ఏదో మోసం జరిగినట్లు అర్థమైందని నవ్వుతూ చెప్పారు. అదృష్టవశాత్తు మిషెల్ కార్డు మాత్రం బాగానే ఉందని ఒబామా తెలిపారు. అమెరికాలో క్రెడిట్ కార్డులకు చిప్ అండ్ పిన్ తరహా రక్షణ కల్పించే ఉత్తర్వులపై ఒబామా సంతకం చేశారు. చివరకు తాను కూడా దీని బారిన పడ్డానని, ఆ విషయం హోటల్లో వెయిట్రెస్కు చెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చిందని ఆయన అన్నారు.