ఎదుర్కొనేందుకు మేం రెడీ: పాక్
న్యూఢిల్లీ: ఎలాంటి నేరం చేయని భారత్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు ఉరి శిక్ష విధించి ఆగ్రహంతో ఉడికిపోయేలా చేసిన పాకిస్థాన్ తాజాగా మరోసారి పుండుమీద కారం చల్లేలా వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు సరిహద్దు వెంట పాకిస్థాన్ భద్రతా బలగాలు, పాక్ ఉగ్రవాదులు మాత్రమే కవ్వింపు చర్యలకు, దాడులకు పాల్పడగా తాజాగా ఏకంగా ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అంతకంటే ఎక్కువగా రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఢీకొట్టేందుకు, ఎదురు నిలిచేందుకు తమ దేశ సైన్యం సిద్ధంగా ఉందంటూ మంగళవారం నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో యుద్ధం పెద్ద దూరంలో ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు. కులభూషణ్‌కు ఉరిశిక్ష విధించడంపై భారత్ హెచ్చరికలు పంపించిన కొద్ది సేపటికే షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘పాకిస్థాన్ ప్రేమపూర్వక శాంతియుత దేశం. దీనిని ఎవరూ బలహీనతగా చూడొద్దు. విభేదాలకన్నా సహకారంతో ఉండటం, సంశయించడంకంటే శ్రేయస్సును పంచుకోవడమే మా దేశం విధానం. స్నేహం విస్తరించుకునే విషయాన్ని మేం ఎప్పుడూ కాదనం’ అంటూ వ్యాఖ్యానించారు.