
క్షిపణి (నమూనా చిత్రం)
ఇస్లామాబాద్ : నావికాదళ యుద్ధ సన్నాహాలను చూసి తాను గర్విస్తున్నానని పాకిస్థాన్ నేవీ చీఫ్ జకౌల్లా అన్నారు. శనివారం పాకిస్థాన్ నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పరీక్షించింది. సీ కింగ్ అనే హెలికాప్టర్ నుంచి దీనిని ఉత్తర అరేబియా సముద్రంలో పరీక్షించింది. ఈ పరీక్ష విజయవంతమైనట్టు పాక్ నేవీ తెలిపింది.
నేవీ చీఫ్ జకౌల్లా సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు వెల్లడించింది. తమది అణుదేశమని ప్రకటించడంతోపాటు భారత్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని అణ్వాయుధాలను కూడా సిద్ధంగా పెట్టుకున్నామని పాక్ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో జరిగిన తాజా పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. 'మా నేవీ పట్ల నేను ఆత్మసంతృప్తిగా ఉన్నాను. పాక్ సముద్ర తలాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉంది. అన్ని తీరాల ప్రయోజనాలకు రక్షణ కవచంగా ఉంది' అని జకౌల్లా పేర్కొన్నట్లు పాక్ రేడియో తెలిపింది.