సమరానికి సై..
ఇస్లామాబాద్: భారత సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్న పొరుగు దేశం పాకిస్తాన్ సమరానికి సై అన్న సంకేతాలను పంపుతోంది. తమ దగ్గర అణ్వాయుధాలున్నాయి జాగ్రత్త అంటూ భారత్ను బెదిరిస్తోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం వస్తే న్లూక్లియర్ ఆయుధాలతో దాడికి సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు.
ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం లేనప్పటికీ ఆ భయం ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయుధాలున్నది షో కేస్లో ఉంచి ప్రదర్శించడానికి కాదని వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశంతో యుద్ధం రాకూడదనుకుంటున్నామని, అణ్వాయుధాల వాడే అవసరం రాకూడదనే గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే దేశ భద్రత కోసం అణ్వాయుధాలను ప్రయోగించే శక్తి సామర్ధ్యాలు తమకున్నాయని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు.
తెహ్రిక్-ఇ-తాలిబన్, బలూచి ఉగ్రవాదులకు భారతదేశం సహకరిస్తుందన్న సాక్ష్యాధారాలను ప్రపంచ సంస్థలకు అందజేశామని ఆయన తెలిపారు. త్వరలో జరగబోతున్న ఇరుదేశాల ప్రధానుల భేటి సందర్భంగా రక్షణ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆరు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను జూలై 10న రష్యాలో కలవనున్నారు.