ఎయిడ్స్ వ్యాప్తికి అతనొక్కడే కారణం కాదు
లండన్: ఉత్తర అమెరికా ఖండంలో ఎయిడ్స్ వ్యాప్తికి కారకుడంటూ ‘పేషెంట్ జీరో’గా ఒక వ్యక్తి ఇంతవరకు నిందలు పడ్డాడు. అయితే ఈ వ్యాధి వ్యాప్తికి అతనొక్కడే కారణం కాదని, ఎయిడ్స్‌ను గుర్తించేనాటికి ఆ వ్యాధి బారిన పడిన వేలాది మందిలో అతడూ ఒకడని తేలింది. చారిత్రక, జన్యుఅంశాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈమేరకు అభిప్రాయపడ్డారు. ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న గాయిటన్ దుగాస్ అనే ఫ్రెంచ్ కెనడియన్ గే 1980లో అమెరికాలో ఎయిడ్స్ సంక్షోభానికి కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
హెచ్‌ఐవీ గుర్తించడానికి ముందు ఈ వ్యక్తి మూలంగానే వేలాది మందికి ఈ వైరస్ సోకిందని భావిస్తారు. అయితే మరణానికి ముందు దుగాస్ పరిశోధకులకు అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని అందజేశాడు. యూకేలోని కేంబ్రిడ్జ్ వర్సిటీ చరిత్రకారుడి పరిశోధన, రక్త నమూనాల జన్యుపరమైన విశ్లేషణల ఆధారంగా కేవలం దుగాస్ మాత్రమే అమెరికాలో ఎయిడ్స్ విస్తృతికి కారణం కాదని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.