
బీజింగ్ : కారు క్రింద ఇరుక్కుపోయిన ఓ మహిళ ప్రాణాలు కాపాడటానికి కొంతమంది కారును సైతం ఒట్టి చేతుల్తో ఎత్తేశారు. ఓ వ్యక్తి ప్రాణాలకోసం పోరాడుతుంటే సెల్ఫీల కోసం ఎగబడకుండా మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించారు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఒక వారం క్రితం చైనాలోని లూజో జాన్‌గ్సి జాంగ్ నగరంలోని ఓ రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటీ మీద వెళుతోంది ఓ మహిళ. ఏమైందో ఏమో స్కూటీ మీదనుంచి ఆమె కిందపడిపోయింది. ఆ వెంటనే మహిళ వెనకాలే వస్తున్న ఓ కారు ఆమె మీదుగా వెళ్లింది. అయితే అక్కడి వారి అరుపులతో విషయం తెలుసుకున్న డ్రైవర్ కొన్ని అడుగులు దూరం వెళ్లగానే కారును నిలిపేశాడు.
కానీ, సదరు మహిళ కారు కిందే ఇరుక్కుపోయింది. క్షణాల్లో కారు చుట్టూ మూగిన జనం ఏమీ ఆలోచించకుండా కారును ఒట్టి చేతుల్తో పైకి ఎత్తి ఆమెను బయటకు తీశారు. అక్కడినుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాణాంతకమైన గాయాలు కాకపోవటం వల్ల మహిళ పరస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మహిళను రక్షించటానికి జనం చూపిన శ్రద్ధను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, వాహనాల క్రింద ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి వాటిని చేతుల్తో పైకి ఎత్తేయడం చైనా ప్రజలకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం జూలైలోనూ ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment