వృత్తి విద్యకోసం ఉద్యోగాలొదిలేస్తున్నారు!
ఇప్పటిదాకా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలకోసం పోటీపడ్డ యువత... ఇటీవల కార్యాలయాల్లో కూర్చొని చేసే మూస ఉద్యోగాలను వదిలేసి మరీ... వృత్తి విద్యను నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. దాదాపు పదిలో ఎనిమిది మంది వృత్తి విద్యను నేర్చుకుంటున్నారని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. డబ్బు ముఖ్యం కాదని, యువత వృత్తి విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారని బాల్వెనీ విస్కీ అందించిన నివేదికల్లో వెల్లడైంది.
ఉద్యోగాలను వదిలేసి మరీ వృత్తి విద్యను నేర్చుకునేందుకు నేటి యువత ఇష్టం చూపిస్తున్నారని బాల్వెనీ విస్కీ తాజా అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీ చదువులను, ఉద్యోగాలను వదిలిపెట్టి 77శాతం మంది ప్రజలు ప్రాచీన కళలు, వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అభివృద్ధి విషయంలో క్రాఫ్ట్ భారీ సమయం తీసుకుంటుందన్న అపోహలను వదిలి, నిజానిజాలను నిర్థారించుకొంటున్నారు. పదివేలమందిపై చేసిన సర్వేలో ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్, కుండల తయారీ వంటి వృత్తులు అగ్రస్థానంలో ఉన్నట్లు గుర్తించారు. అయితే వృత్తి విద్యను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలపాలని ప్రశ్నించినపుడు మాత్రం... అదో ప్రతిభావంతమైన విద్య అని, చికిత్సా పద్ధతిగా కూడ పని చేస్తుందని, కార్యాలయాల్లో కూర్చొని పనిచేసే సాధారణ ఉద్యోగాల కంటే.. వృత్తి విద్య ఒత్తిడిని సైతం నివారిస్తుందని కనుగొన్నట్లు తెలిపారు. దీనికి తోడు చెఫ్, జ్యువెలరీ డిజైన్, తోటపని వంటి ఇతర కళాత్మక విద్యలు కూడ జాబితాలో అత్యధికంగా నిలుస్తున్నట్లు గుర్తించారు.
ఇప్పటికే కళాత్మక వృత్తుల్లోకి అడుగిడిన యువత... వారి జీవితంలో పూర్తిశాతం గాని, కనీసం సగభాగమైనా వృత్తి కళలు నేర్చుకునేందుకు సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో ఫొటోగ్రఫి 12 శాతం, ఛెఫ్, బేకింగ్ 7 శాతం, సంగీతం 6 శాతం, గార్డెనింగ్ కు 3 శాతం, ప్రాధాన్యత పెరిగిందని అధ్యయనకారులు చెప్తున్నారు. ఎక్కువశాతం సెక్యూరిటీ అటెండెంట్స్, ఐటి కన్సల్టెంట్స్, అకౌంటెంట్లు తమ ఉద్యోగాలను వదిలి వృత్తి విద్యల్లో చేరుతున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. .బాల్వెనీ విస్కీ సిరీస్ లో భాగంగా కళాకారుడు డిన్నర్ రూపొందించిన లఘు చిత్రం ప్రారంభం సందర్భంగా ఈ కొత్త విషయాలను వెల్లడించారు.