
టాయిలెట్‌లో సమస్య కారణంగా ప్రయాణం మధ్యలోనే తిరిగి వెళుతున్న నార్వే విమానం
నార్వే : టాయిలెట్లలో సమస్య ఏర్పడి దాదాపు సగం దూరం వెళ్లిన విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చి దింపేశారు. ఆ విమాన ప్రయాణీకుల్లో టాయిలెట్స్‌లో సమస్య ఏర్పడితే పరిష్కరించే ప్లంబర్స్ 60మందికి పైగా ఉన్నప్పటికీ వారు ముందుకు రాకపోవడంతో దాదాపు రెండున్నరగంటలపాటు రివర్స్ జర్నీ చేసి సమస్య పరిష్కరించుకోవాల్సి వచ్చింది. నార్వే ఎయిర్ విమానంలో ఈ సమస్య తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. నార్వేలోని ఓస్లో నుంచి డీవై 1156 అనే విమానం జర్మనీలోని మ్యూనిచ్‌కు బయలుదేరింది. అది సరిగ్గా స్వీడన్ బోర్డర్ దాటే సమయంలోనే టాయిలెట్‌లలో సమస్య ఉన్నట్లు తెలిసింది. అయితే, అదే విమానంలోమ మొత్తం 186మంది ప్రయాణీకులు ఉండగా కనీసం 60 నుంచి 70మంది ప్లంబర్లు ఉన్నారు.
వారంతా రార్క్‌జాప్ అనే కంపెనీలో పనిచేసేందుకు మ్యూనిచ్‌కు వెళుతున్నారు. పైగా వారందరికీ మంచి సుశిక్షితులుగా గుర్తింపు ఉంది. కానీ, వారిలో ఏ ఒక్కరు కూడా టాయిలెట్‌లో సమస్యను పరిష్కరించి తమను తాము నిరూపించుకోలేకపోయారు. దీనిపై వర్కర్లను తెప్పించుకున్న కంపెనీ సీఈవో ఫ్రాంక్ ఓల్సెన్ మాట్లాడుతూ సహాయం చేసేందుకు తమవాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పటికి విమానం 10వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని, ఆ సమస్య వెలుపల నుంచి పరిష్కరించాల్సింది కావడంతో తమ వారెవరూ కూడా ఆ పనిచేయలేదని వివరణ ఇచ్చారు. మొత్తానికి దాదాపు రెండుగంటలపాటు ప్రయాణించిన విమానాన్ని తిరిగి ఓస్లోకు మళ్లించి సమస్య పరిష్కరించి మరోసారి ప్రయాణం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment