
టెహ్రాన్: అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో జనవరి 8న తాము పొరపాటున కూల్చేసిన ఉక్రెయిన్ విమాన ఘటనపై మంగళవారం ఇరాన్ మరింత వివరణ ఇచ్చింది. ఆ రోజు ఉదయం టెహ్రాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానం నగర శివార్లలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని తమ రెండు ‘టార్ ఎం1’ క్షిపణులు కూల్చేశాయని తాజాగా ప్రకటించింది.
విమానంలోని బ్లాక్ బాక్స్‌లను డీకోడ్ చేసే అత్యాధునిక సాంకేతికత తమ వద్ద లేదని, డీకోడ్ చేసేందుకు అమెరికా, ఫ్రాన్స్‌ల సాయం కోరామని, వారి నుంచి సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ఇరాన్ పౌర విమానయాన విభాగం తెలిపింది. టార్ ఎం1 భూమిపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలపై ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి. దీన్ని విమానాలు, క్షిపణులు లక్ష్యంగా నాటి సోవియట్ యూనియన్ రూపొందించింది. ఉక్రెయిన్‌లోని కీవ్‌కు వెళ్లాల్సిన ఆ బోయింగ్ 737 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు 176 మంది ఉండగా, వారంతా దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు నిరసనగా ఇరాన్‌లోనూ విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు.