
టెహ్రాన్: ఇరాన్ అతివాద నాయకుడు, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీ నెజాద్ (64) మరోసారి అదే పదవి ఆశిస్తున్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అణ్వస్త్ర కార్యక్రమాల్లో దూకుడుగా వ్యవహరించి, పశ్చిమ దేశాలకు సవాలు విసిరారు. అహ్మదీ నెజాద్ వైఖరి నచ్చని అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్‌ను దుష్టదేశాల జాబితాలో చేర్చింది. తాజాగా మళ్లీ అధ్యక్ష పదవికి పోటీపడాలని నెజాద్ నిర్ణయించుకున్నారు. బుధవారం అభ్యర్థిగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇరాన్‌లో జూన్ 8న ఎన్నికలు జరుగనున్నాయి. చురుకైన నేతగా ఇరాన్ ప్రజల్లో ఆదరణ ఉన్న నెజాద్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఖాయమేనన్న అంచనాలు వెలువడుతున్నాయి.
2017 జరిగిన ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆయన విఫలయత్నం చేశారు. అప్పట్లో నెజాద్ ప్రయత్నాలకు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అడ్డుతగిలారు. ఈసారి ఆ పరిస్థితి లేదని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ పట్ల ప్రజల్లో విముఖత వ్యక్తమవుతోంది. కరోనా మహమ్మారి విజృంభన, అమెరికా ఆంక్షలతో పూర్తిగా చితికిపోయిన ఇరాన్ ప్రజలు ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే వచ్చా..
అహ్మద్ నెజాద్ రిజిస్ట్రేషన్ కేంద్రంలో తన రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలని లక్షలాది మంది కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చడానికే బరిలోకి వచ్చానని చెప్పారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు తనకు తెలుసని అన్నారు. దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించే నాయకత్వం రావాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అహ్మదీ నెజాద్ 2005 నుంచి 2013 వరకూ వరుసగా రెండు పర్యాయాలు ఇరాన్ అధ్యక్షుడిగా సేవలందించారు. నెజాద్ హయాంలో చమురు శాఖ మంత్రిగా పనిచేసిన రుస్తుం ఘాసేమీ కూడా ఇరాన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.
(చదవండి: Israel- Palestine: మధ్య ప్రాచ్యం.. మరింత ఉద్రిక్తం)