
పోప్ ఫ్రాన్సిస్‌ను కదిలించిన ఫొటో
సాక్షి, వెబ్ డెస్క్ : లోకం చీకటిమయంగా మారడానికి కారణమైన అణు యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. రెండేళ్ల తమ్ముడి శవాన్ని వీపునకు కట్టుకుని శ్మశానవాటికకు మోసుకెళ్తున్న పదేళ్ల బాలుడి చిత్రం గురించి ప్రత్యేకించి చర్చించారు. అమ్మ ఒడి నుంచి బయటకు రాని పసివాళ్ల చుట్టూ ఉన్న లోకం చీకటి మయం కావడానికి కారణం రెండో ప్రపంచ యుద్ధమని అన్నారు.
జపాన్ దేశంలో ఆరేళ్లుగా జరగుతున్న రెండో ప్రపంచయుద్ధ మారణకాండ ఆగష్టు 9, 1945న ఉగ్రరూపం దాల్చింది. జపాన్‌లోని నాగసాకిపై అమెరికా అణుబాంబును విసిరింది. దీంతో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర మారణకాండకు సంబంధించిన చిత్రాలను అమెరికా మెరైన్స్ ఫొటోగ్రాఫర్ జోయ్ ఒ డొన్నెల్ తన కెమెరాలో బంధించారు.
1945 అణుబాంబు దాడి అనంతరం నాలుగేళ్ల పాటు డొన్నెల్ జపాన్‌లోనే ఉన్నారు. ఆయన తీసిన వందల చిత్రాల్లో తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడిది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని చూసిన పోప్ ఫ్రాన్సిస్ చలించిపోయారు.
యుద్ధ పరిణామాల గురించి ఈ ఫొటో చెబుతున్నంత స్పష్టంగా మరేదీ చెప్పలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో బాలుడి బాధ వర్ణానాతీతం అని చెప్పారు. పళ్లతో పెదవులను అదిమిపెట్టి బాధను ఓర్చుకునేందుకు బాలుడు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
ట్రంప్ వర్సెస్ కిమ్
ఉత్తరకొరియా పదే పదే అణుదాడిపై మాట్లాడుతున్న నేపథ్యంలో అణు ఆయుధ వ్యతిరేక సమావేశంలో ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగసాకిపై అణు దాడి ఫొటోలను తిలకించారు. శ్మశానవాటికలో తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడి క్షోభ ప్రపంచ దేశాలకు అర్థం కావాలని, అందుకే ఈ ఫొటోను పునః ముద్రించి అందరికీ పంచాలని కోరారు. అణు హెచ్చరికలపై కిమ్ దేశంతో చర్చలు జరిపేందుకు వాటికన్ సిటీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment