
అమెరికాలో అదే ప్రతిష్టంభన
వార్షిక బడ్జెట్ ఆమోదం పొందని నేపథ్యంలో అమెరికాలో నెలకొన్న ఆర్థిక ప్రతిష్టంభన, రాజకీయ సంక్షోభం ఇంకా అలాగే కొనసాగుతున్నాయి.
వాషింగ్టన్: వార్షిక బడ్జెట్ ఆమోదం పొందని నేపథ్యంలో అమెరికాలో నెలకొన్న ఆర్థిక ప్రతిష్టంభన, రాజకీయ సంక్షోభం ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఒబామాకేర్’ వైద్య పాలసీపై కాంగ్రెస్‌లో తలెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో మంగళవారం మొదలైన ‘షట్‌డౌన్’ ప్రభావం అగ్ర రాజ్యంపై తీవ్రంగా పడుతోంది. రక్షణ, తపాలా వంటి అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇంకా మూతబడే ఉన్నాయి.
దాదాపుగా 8 లక్షల పై చిలుకు ప్రభుత్వోద్యోగులు ‘వేతనం లేని సెలవులు’ గడుపుతున్నారు. జాతీయ పార్కులు, ప్రముఖ పర్యాటక స్థలాలు, కార్యాలయాలతో పాటు ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా మూగబోయే ఉన్నాయి. అక్టోబర్ 17 లోగా సమస్య పరిష్కారం కాకపోతే అమెరికా ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండని పరిస్థితి తలెత్తనుంది! కానీ డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మాత్రం పరిస్థితికి కారణం మీరంటే మీరంటూ పరస్పరం నిందారోపణలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీనిపై ఒబామా, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య గురువారం జరిగిన భేటీ కూడా ఎటూ తేలకుండానే ముగిసింది.
షట్‌డౌన్‌కు దారితీసిన పరిస్థితులతో తాను తీవ్రంగా విసిగిపోయానని ఒబామా అన్నారు. అమెరికా సర్కారునే దివాలా తీయించేలా ఉన్న ఈ పరిణామాలపై పెట్టుబడిదారులతో పాటు వాల్‌స్ట్రీట్ కూడా ఆందోళన చెందాలంటూ హెచ్చరిక స్వరం విన్పించారు. అయితే, ‘రిపబ్లికన్లతో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో నా పదవీకాలంలో చాలాసార్లు పట్టువిడుపులతో వ్యవహరించాను. అందుకే నన్ను మరీ మెతక మనిషిగా కూడా అంతా భావిస్తుంటారు. ఈసారి మాత్రం నేనెలాంటి ఒత్తిళ్లకూ లొంగేది లేదు. బడ్జెట్‌ను కాంగ్రెస్ తక్షణం ఆమోదించి సమస్యకు ముగింపు పలకాలి’’ అని సీబీఎస్ న్యూస్ ఇంటర్వ్యూలో అని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక బిల్లుకు తాత్కాలికంగానైనా సరే, ముందుగా ఆమోదం పడాల్సిందేనన్నారు. ఈ విషయమై రిపబ్లికన్లతో ఎలాంటి బేరసారాలకూ సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.