సాక్షి,న్యూఢిల్లీ: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్లు పోటీ చేయరా?.. వాళ్లే ఆసక్తి చూపించడం లేదా? లేదంటే కొత్త రక్తం ప్రొత్సహించే క్రమంలో అధిష్టానమే వాళ్లను దూరం పెడుతోందా?. కనీసం అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల్లోనూ వాళ్ల ప్రస్తావన మచ్చుకు కూడా రాకపోవడానికి కారణం ఏంటి?..
మార్చి 11న (సోమవారం) మిగిలిన స్థానాల్లో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల కోసం.. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) రెండోసారి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో గుజరాత్ (14), రాజస్థాన్ (13), మధ్యప్రదేశ్ (16), అస్సాం (14), ఉత్తరాఖండ్ (5) ఇలా మొత్తం 62 లోక్‌సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారిలో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల పేర్లు లేకపోవడంతో ఈ లోక్‌సభ ఎన్నికలకు వాళ్లు పోటీ చేయడం లేదనే ఉహాగానాలు ఊపందుకున్నాయి.
- కర్ణాటక గుల్‌బర్గా లోక్‌సభ సీటును అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటాయించింది. కానీ ఈ సారి ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించడం లేదు. తనకు బదులుగా తన అల్లుడు రాధాకృష్ణన్ దొడ్డమణికి సీటు ఇవ్వాలని ఆయన ఒక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
ఖర్గేతో పాటు నలుగురు మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్ , కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, హరీష్ రావత్ పాటు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ సైతం ఉండే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.
2. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్‌కు బదులు ఆయన కుమారుడు వైభవ్ గహ్లోత్ లోక్‌సభ బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సెంట్రల్ ప్యానల్ జలోర్ లోక్‌సభ సీటు కేటాయించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
3. మరోవైపు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కుమారుడు, ప్రస్తుత చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ అదే స్థానం నుంచి రెండో సారి సుముఖంగా ఉన్నారు.
4. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అనారోగ్య కారణాలతో హరిద్వార్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో తన కుమారుడు వీరేంద్ర రావత్‌కు టికెట్ ఇవ్వాలని కోరారు.
5. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సచిన్ పైలట్ కూడా ఈసారి బరిలో నిల్చోవడం లేదని సమాచారం. ఇప్పటికే ఆయన ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి బాధ్యతల్లో ఉన్నారు. అక్కడ పార్టీ పరిస్థితిని మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని చెబుతున్నారాయన. అలాగే.. రాజస్థాన్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల గెలుపు బాధ్యతల్ని పార్టీ పైలట్‌కే అప్పజెప్పింది.
6. నియోజకవర్గ పునవ్యవస్థీకరణతో.. గౌరవ్ గొగోయ్ తన మునుపటి సీటు కలియాబోర్‌లో పోటీకి దూరం కావొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే తన తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ సొంతగడ్డ జోర్హాట్ నుండి పోటీ చేసే అవకాశం ఉందని గౌరవ్ అనుచరులు చెబుతున్నారు.
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కీలకమైన ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలపై చర్చించేందుకు మార్చి 15న సమావేశం నిర్వహించనుంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ పలువురు సీనియర్లకు టికెట్ ఉండకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment