హార్ట్ టచింగ్ ఫొటో.. వైరల్
కళ్లముందే సాటి మనిషి కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా మన పనుల్లో నిమగ్నమవుతాం. ప్రాణాలు పోతున్నా గుడ్లప్పగించి చూస్తాం తప్పితే ఆపన్నహస్తం అందించం. కానీ మూగజీవాలు అలా కాదు. సాటి జంతువుకు కష్టమొస్తే అండగా నిలబడతాయి. మేమున్నామంటూ అండగా నిలుస్తాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన హార్ట్ టచింగ్ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బ్రెజిల్‌కు చెందిన సులెన్ షుమలొయ్‌ఫెల్ అనే జర్నలిస్టు ఈ ఫొటోను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఈ ఫొటో తీశారు. గతేడాది వీరిద్దరూ ఎనిమిది నెలల వయసున్న లానా అనే కుక్క పిల్లను తెచ్చుకున్నారు. బాగా చలిగా ఉండడంతో రెండు వారాల తర్వాత దాని కోసం ప్రత్యేకంగా దళసరిగా ఉన్న బ్లాంకెట్ కొన్నారు. తర్వాతి రోజు ఉదయం లేచి చూసిన సులెన్ పియాన్స్‌కు ఊహకు అందని దృశ్యం కనపడింది. బ్లాంకెట్‌కు ఒక చివర లానా, మరోవైపున వీధి కుక్క పడుకునివుండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఒక దుప్పటిని రెండు మూగజీవాలు పంచుకుని చలిని జయించిన తీరును చూసి ఆయన చలించిపోయారు. తనకోసం తెచ్చిన దుప్పటిని సాటి కుక్కకు పంచిన లానాను అభినందనపూర్వకంగా చూశారు. వెంటనే ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు.
ఈ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా 45 వేల మందిపైగా స్పందించారు. 26 వేల సార్లు షేర్ చేశారు. లానా లాంటి మంచి మనసున్న కుక్కను తన జీవితంలో ఎప్పుడు చూడలేదని సులెన్ పొంగిపోతున్నారు. లానాలోని మరో కోణాన్ని తమకు పరిచయం చేసిన వీధి కుక్కకు రోజు ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే దానికి కూడా మంచి గూడు ఏర్పాటు చేస్తామన్నారు.