కొత్త మలేరియా వ్యాక్సిన్ కనిపెట్టారు..
మెల్బోర్న్ః మలేరియా నివారణకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్ ను కనిపెట్టారు. ఎర్ర రక్తకణాలను హరించి మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కొనేందుకు నూతన యాంటీ మలేరియా చికిత్సను అభివృద్ధి చేశారు. వాల్తేర్ అండ్ ఎలీజా హాల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ అలాన్ కౌమాన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో, ఎర్ర రక్తకణాల్లోకి కీ ప్రొటీన్లు పంపించడం ద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములు లోపలికి చొచ్చుకొని వెళ్ళలేవని తెలుసుకున్నారు.
దోమకాటుద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 30 కోట్ల నుంచి 50 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మలేరియా సోకినవారిలో ప్రతియేటా 4.5 లక్షలమంది దాకా చనిపోతున్నారు. అంతేకాక చిన్నపిల్లల్లో పెరుగుదలను కూడ దెబ్బతీసే ఈ వ్యాధి... గర్భిణీలకు మరింత ప్రమాదకరం. అటువంటి వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చని అధ్యయనకారులు చెప్తున్నారు. అందుకే ప్రభుత్వాలు మలేరియా నివారణకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను అందించడమే కాక, పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రతపై కూడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా 5 ఏళ్ళలోపు వయసున్న పిల్లలపై మలేరియా ప్రభావం అధికంగా ఉంటోందని, దోమల్లో గ్రహణ శక్తి పెరగటంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న యాంటీ మలేరియల్ మందులు ప్రభావం తగ్గుతోందని, అందుకే కొత్త పరిశోధనలద్వారా మలేరియా క్రిములను ఎదుర్కొనే మందులను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. కౌమాన్ బృందం తాజాగా ఆర్ హెచ్ 5, ఆర్ ఐపీఆర్, సీవై పీఆర్ ఏ మొదలైన మూడు ప్రొటీన్లను కలిపి, ఆరోగ్యంగా ఉన్న మానవ రక్త కణాల్లోకి పంపించడంద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కోవచ్చునని కనుగొన్నారు. ఇలా చేయడంవల్ల మలేరియా క్రిములు ఎర్ర రక్తకణాలను హరించలేకపోయాయని తమ పరిశోధనలద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రొటీన్లతో టీకాలు వంటివి అభివృద్ధి చేసి, వ్యాక్సిన్లుగా ఇవ్వొచ్చని కౌమాన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మలేరియాకు కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి పరిచే పరిశోధనలకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక వ్యాక్సిన్లకు మలేరియా క్రిములు అలవాటు పడిపోయాయని, ఈ పరిస్థితుత్లో కొత్త చికిత్సల అవసరం ఎంతైనా ఉందన్నారు. సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ జర్నల్ లో కౌమాన్ బృందం.. తమ తాజా పరిశోధనలను నివేదించారు.