మానవ జీవితంలో రాగికి ఉన్న ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. యాంటీ బాక్టీరియల్ గుణాలున్న రాగి.. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది ఈ లోహంతో తయారు చేసిన పాత్రలో నిల్వచేసిన నీటిని తాగుతారు. అంతేగాక గాయాలను త్వరగా నయం చేయడమే గాకుండా రక్తహీనతను అరికట్టే శక్తి దీనికి ఉంటుంది. ఇక రాగిని శరీరానికి అందించడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చని అమెరికాకు శాస్త్రవేత్తలు గతంలో వెల్లడించారు. ఇవే కాకుండా మరెన్నో గొప్ప లక్షణాలున్న రాగితో తయారు చేసిన లేదా రాగి పూత ఉన్న వస్తువుల వాడకం మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని బ్రిటీష్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విలియం కీవిల్ తాజాగా వెల్లడించారు.
మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు కనిపెడతారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవిస్తూనే...వైరస్ మన దరి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడమే ఉత్తమైన మార్గమని నిపుణులు అంటున్నారు. ఇక కరోనా కాలంలో మాస్కు ధరించడం, సామాజిక ఎడబాటు పాటించడం తప్పనిసరి చేసిన ప్రపంచ దేశాలు.. అధిక జనసంచారం ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు సహా ఇంట్లోనూ రాగి పూత ఉన్న వస్తువులను వాడేలా ప్రజలను ప్రోత్సహించాలంటున్నారు ప్రొఫెసర్ విలియం కీవిల్.(ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?)
4 గంటల్లో వైరస్ ఖతం!
యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సీనియర్ మైక్రోబయోలజిస్ట్ అయిన ప్రొఫెసర్ విలియం దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ లోహాల యాంటీ బాక్టీరియల్ గుణాలపై పరిశోధనలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన పరిశోధనలు మరింత ముమ్మరం చేసిన ఆయన.. రాగితో తయారు చేసిన లేదా రాగి పూత ఉన్న వస్తువులపై వైరస్ చేరినట్లయితే కేవలం నాలుగు గంటల్లోనే అది అంతమవుతుందని పేర్కొన్నారు. కాపర్‌పై వైరస్ చేరినపుడు దానిలోని అయాన్లు, ఎలక్ట్రాన్లు వైరస్ మెంబ్రేన్(సంరక్షక పొర)పై దాడి చేసి.. డీఎన్‌ఏను నిర్వీర్యపరిచి.. దానిని పూర్తిగా నాశనం చేస్తుందని వెల్లడించారు.
ఈ విషయం గురించి విలియం ది టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘స్టీలుపై కరోనా మూడు రోజుల పాటు బతికి ఉంటుంది. అదే రాగిపై కేవలం నాలుగు గంటలు మాత్రమే జీవించి ఉండగలదు. సాధారణంగా బయటకు వెళ్లినపుడు చాలా మంది హ్యాండ్ రెయిల్స్ వంటి కంటామినేటెడ్ ఉపరితలాలను తాకుతూ ఉంటారు. ఆ తర్వాత అదే చేతిని ముఖంపై ఆనించినట్లయితే కళ్లు, నోరు లేదా ముక్కు నుంచి వైరస్ లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి మనం రోజూ ఎక్కువగా ఉపయోగించే డోర్ హ్యాండిల్స్, షాపింగ్ ట్రాలీలు, హ్యాండ్ రెయిల్స్, జిమ్ పరికరాలు, క్యాష్ మెషీన్లపై కాపర్ పూత వేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు.
ఆ దేశాల్లో ఇప్పటికే వాడకం
ఇక వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూకేలో జనసమ్మర్ధం ఉన్నచోట రాగి పూత వేసిన వస్తువులు ఎక్కువగా వాడాల్సి ఉందని విలియం సూచించారు. పోలాండ్‌లో బస్సుల్లో రాగితో తయారు చేసిన హ్యాండ్‌రెయిల్స్ వాడుతున్నారని, చిలీ ఎయిర్‌పోర్టుల్లో, బ్రెజిల్ ఇమ్మిగ్రేషన్ కియోస్కుల్లో రాగి వాడకం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. యూకేలోనూ ప్రభుత్వ భవనాలు, రైల్వే, బస్సు స్టేషన్లలో రాగి హ్యాండ్ రెయిల్స్, తలుపు బెడాలను ఉపయోగించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
కాగా గతంలో అమెరికా శాస్త్రవేత్తల బృందం సైతం.. ఇంటెన్సివ్ కేర్‌లో రాగి పూత ఉన్న పరికరాలను వాడినపుడు.. మిగతా లోహాలతో పోలిస్తే బాక్టీరియాను చంపగల శక్తి 95 శాతం ఎక్కువగా ఉందని వెల్లడించింది. అదే విధంగా దక్షిణ కరోలినాలోని ది మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక వెంటిలేషన్ సరిగా లేని చోట్ల వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వుహాన్ వైద్య నిపుణులు తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
కరోనా ఎక్కడ .. ఎంతసేపు జీవించి ఉంటుంది?
- కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరల్లో ఉండే వైరస్ కణాలు గాలిలో మూడు గంటల పాటు బతికి ఉంటాయి.
- ప్లాస్టిక్, స్టీల్, బెంచ్ ఉపరితలం, గాజు, స్టీలు వస్తువులపై ఎక్కువగా 72 గంటల పాటు వైరస్ జీవించి ఉంటుంది.
- కార్డు బోర్డు, కాగితం, ఫ్యాబ్రిక్స్‌పై 24 గంటల పాటు చురుగ్గా ఉంటుంది.సమయం గడిచే కొద్దీ వైరస్ ప్రభావం తగ్గిపోతుంది.
- కానీ ఈ లోపు మనం సదరు వస్తువులను తాకినట్లయితే మనలోకి వైరస్ ప్రవేశించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment