
వాషింగ్టన్: భూమిపైన దొరికిన అత్యంత పురాతనమైన ఘన పదార్థం ఒకదాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రహశకలం లోపల నిక్షిప్తమై ఉన్న ఈ పదార్థం సౌర కుటుంబం ఏర్పడక ముందు కాలం నాటిది కావడం విశేషం. యాభై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో దొరిగిన గ్రహశకలంలో ఈ పదార్థం ఉందని, సుమారు 700 కోట్ల ఏళ్ల క్రితం కొత్త నక్షత్రాలు ఏర్పడిన కాలం నాటి పరిస్థితులకు ఇది సాక్ష్యమని పీఏఎన్‌ఎస్ జర్నల్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది.
ఈ పదార్థం నక్షత్రాల నమూనా అని, అసలైన నక్షత్ర ధూళి అని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త, షికాగో వర్శిటీకి చెందిన ఫిలిప్ హెక్ తెలిపారు. భూమ్మీద రాలిపడే గ్రహ శకలాల్లో కేవలం ఐదు శాతం వాటిల్లో ఇలాంటి నక్షత్రధూళి లేదా ప్రీసోలార్ గ్రెయిన్స్ ఉంటుందని హెక్ తెలిపారు. వీటిని గుర్తించేందుకు ముందుగా గ్రహశకలాన్ని పేస్ట్‌లా మారుస్తారని తెలిపారు. యాసిడ్‌లో ఈ పేస్ట్‌ను ముంచినప్పుడు ప్రీ సోలార్ గ్రెయిన్స్ మాత్రమే మిగిలి, మిగిలినదంతా కరిగిపోతుందన్నారు. వీటిని వేరు చేసి పరిశీలించడం ద్వారా ఆ రేణువులు ఏ నక్షత్రం నుంచి వచ్చాయో తెలుస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment